HomeతెలంగాణKTR: రేవంత్ ను కించపరిస్తే ఏం లాభం? కేటీఆర్ సార్.. "ఇన్నోవేటివ్" రాజకీయాలు చేయండి

KTR: రేవంత్ ను కించపరిస్తే ఏం లాభం? కేటీఆర్ సార్.. “ఇన్నోవేటివ్” రాజకీయాలు చేయండి

KTR: కేటీఆర్.. మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రిగా కొనసాగారు. దావోస్ నుంచి మొదలుపెడితే దామరచర్ల వరకు అన్నిట్లో ఆయనే ఉండేలా చూసుకున్నారు. పెట్టుబడులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..అబ్బో ఒకటా, రెండా ఆ హడావిడి కి అడ్డూ అదుపు ఉండేది కాదు.. ఇక కేటీఆర్ పాల్గొన్న ప్రతి సభలోనూ ఇన్నోవేటివ్ ఆలోచనలు కలిగి ఉండాలని పిలుపునిచ్చేవారు. ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తేనే ఇతరుల మనసును ఆకట్టుకుంటామని చెప్పేవారు. కానీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ఆ ఇన్నోవేటివ్ విధానాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో అప్డేటెడ్ గా ఉండాల్సిన ఆయన రొటీన్ రొడ్డ కొట్టుడు రాజకీయాలు చేస్తున్నారు.

సాధారణంగా అధికారంలో ఉన్న వారిని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు. గతంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే చేశారు. కొన్నిసార్లు అధికార పక్షం మీద పై చేయి సాధించారు. మరికొన్నిసార్లు ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ అధికార పక్షాన్ని ప్రశ్నించడం ఆయన మానుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్ష స్థానం నుంచి రేవంత్ రెడ్డి అధికార పక్షంలోకి వెళ్లిపోయారు. అధికార పక్షం నుంచి భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంలోకి వచ్చింది. అయితే ఇన్నాళ్లు అధికారంలో ఉన్నామనే భావమో.. మరి ఒకటో తెలియదు గాని.. ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడి గానే చూస్తోంది. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ తప్పులు వెతుకుతోంది. ఆటో డ్రైవర్లను విమర్శించారని, ఐఏఎస్ అధికారులను తక్కువ చేసి మాట్లాడారని.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. అంతేకాదు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఆటో డ్రైవర్ల సంఘంతో నిరసనలు, ధర్నాలు చేయిస్తోంది. ఇప్పుడు మాత్రమే కాదు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు గొల్ల కురుమలపై ఏవో వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ధర్నాలు చేయించింది. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయించింది. కానీ అవేవీ భారత రాష్ట్ర సమితి అనుకున్నంత వర్కౌట్ కాలేదు.. ఇప్పుడున్న స్మార్ట్ రాజకీయాలలో అలాంటి “కించపరచుడు” నిరసనలు వర్కౌట్ అవుతాయని ఎవరూ అనుకోవడం లేదు.. రైతుబంధు, దళిత బంధు, సంక్షేమ పథకాల అమలు.. ఇంకా చాలా విషయాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు గాని.. అవేవీ జనాల్లో నిరసనను తేలేకపోతున్నాయి.

మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయం చేశామని ఆ ప్రభుత్వం చెప్పుకుంది. కోటి ఎకరాల మాగాణమని చెప్పుకుంది. కానీ అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారని ఆరోపించడం ప్రారంభించింది. కరెంటు ఇవ్వడం లేదని, నీళ్లు రావడంలేదని, రైతు బంధు పథకాన్ని బొంద పెట్టారని, దళిత బంధు పథకాన్ని ఆపారని, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తున్నారని, మహాలక్ష్మి పథకాన్ని అమలులో పెట్టి ఆటో డ్రైవర్లను ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురి గొలుపుతున్నారని.. ఇలా రకరకాల విమర్శలు చేస్తోంది. అయితే ఇవన్నీ కూడా గాలి కొట్టుకుపోయే పేలపిండి లాగానే అయిపోతున్నాయి. ఒక ప్రభుత్వానికి ఆరు నెలలపాటు హనీమూన్ పీరియడ్ ఉంటుందన్న కనీస స్పృహ కూడా కేటీఆర్ లాంటి నాయకుడికి లేకపోవడం బాధాకరం. ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వాటి అమలు దిశగా అడుగులు వేస్తోంది. శనివారం ప్రకటించిన బడ్జెట్ లోనూ భారీగా నిధులు కేటాయించింది. మరి అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలీ అంటే కేటీఆర్ లాంటి నాయకుడు ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి. అంతేగాని అవుట్ డేటెడ్ కించపరిచే రాజకీయాలు చేస్తే ఆ పార్టీకే ప్రమాదం. దీనివల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నష్టం జరగకపోగా ఆయన మరింతగా మాస్ ప్రజల్లోకి వెళ్తారు. అది ఎంత ప్రమాదమో భారత రాష్ట్ర ప్రభుత్వానికి మొన్నటి ఎన్నికల్లో తెలిసి వచ్చింది. ఇప్పటికీ అలానే చేస్తామంటే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత నష్టాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే రేపటినాడు కించపరిచే నిరసనలు చేపట్టేందుకు పార్టీలో ఎవరూ మిగలరు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular