CM Jagan Delhi Tour: రాజకీయాలనేవి వ్యక్తిగతంగా ఉండకూడదు. మరి ముఖ్యంగా మీడియా అధిపతులకు రాజకీయ వాసన అస్సలు ఉండకూడదు. అలా రాజకీయాలను ప్రభావితం చేయాలి అని మీడియా అధిపతులు అనుకుంటే ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభానికి అర్థమే ఉండదు. కానీ తెలుగు నాట అలా కాదు కదా.. ఇక్కడి మీడియా అధిపతులకు.. ప్రధానంగా టిడిపి అనుకూల మీడియా అధిపతులకు రాజకీయవాసనలు ఎక్కువ. అందుకే తమకు అండగా ఉండే ప్రభుత్వానికి వారి సపోర్ట్ ఉంటుంది. లేకుంటే తాటికాయంత అక్షరాలతో పేజీలకు పేజీలు వ్యతిరేక వార్తలు ప్రచురిస్తూ ఉంటారు. వాళ్లు బురద చల్లుతూ ఉంటారు.. కడుక్కోవడం ఎదుటివారి వంతు అవుతుంది.. అయితే ఇలా టిడిపి అనుకూల మీడియా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు హయాంలో ఒక వెలుగు వెలిగింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే టిడిపి అనుకూల మీడియాకు ప్రత్యామ్నాయంగా మరో మీడియా వచ్చింది. అయినప్పటికీ టిడిపి అనుకూల మీడియాను ఎదుర్కోవడం ప్రత్యామ్నాయ మీడియాకు చేతకావడం లేదు. సరే ఆ విషయం పక్కన పెడితే. టిడిపి మీడియా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడటంలో ముందు వరుసలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు కోణంలోనే ప్రతి వార్తను రాస్తూ ఉంటుంది కాబట్టి.. ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఆ మీడియాకు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన ఏది చేసినా తెలుగుజాతి ప్రయోజనాల కోసం.. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం.. మిగతావారు ఏం చేసినా కేసులనుంచి కాపాడుకోవడం కోసం. లేక దర్యాప్తు సంస్థల అధికారులు దాడులు చేయకుండా అక్రమాస్తులను కాపాడుకోవడం కోసం.. అనేలాగా సూత్రీకరిస్తూ ఉంటుంది.
ఇటీవల చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు.. ఆయనను కలవడం వెనక అసలు ఉద్దేశం ఏమిటో అందరికీ తెలుసు. కానీ ఈ విషయాన్ని పచ్చ మీడియా షుగర్ కోటెడ్ టాబ్లెట్ లాగా రాసుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు నడుం బిగించారని.. త్వరలో బిజెపి టిడిపి తో పొత్తు కుదుర్చుకుంటుందని.. టిడిపి లేకపోతే బిజెపికి ఏపీలో మనుగడ లేదని.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు స్నేహహస్తం కోసం బిజెపి తాపత్రయపడిందని డప్పు కొట్టింది.. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని బిల్లుల విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేయాలని కోరారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. వాస్తవ విషయం ఇలా ఉంటే పచ్చ మీడియా మరో విధంగా రాస్కొచ్చింది.
త్వరలో ఎన్నికలు జరగబోతున్నందున జగన్మోహన్ రెడ్డికి ఏపీలో గెలిచే పరిస్థితి లేదని.. అందుకే నరేంద్ర మోడీ ని కలిశారని, తన మీద ఉన్న కేసుల నుంచి ఉపశమనం, అక్రమాస్తులను కాపాడుకోవడం.. వంటి విషయాలను ప్రస్తావించారని.. కానీ నరేంద్ర మోడీ ఇందుకు ఒప్పుకోలేదని.. చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డిని చివాట్లు పెట్టారని టిడిపి అనుకూల మీడియా రాసింది. అంతేకాదు దీనికి బ్రహ్మాండంగా “నాడు రంకెలు నేడు సలాములు” అని శీర్షిక పెట్టింది. కానీ ఇక్కడ ఆ టిడిపి అనుకూల మీడియా మర్చిపోయింది ఏంటంటే.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టయి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నప్పుడు.. నారా లోకేష్ దగ్గుబాటి పురందేశ్వరిని వెంటబెట్టుకొని మరీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చంద్రబాబునాయుడుకు బెయిల్ వచ్చింది. లేకుంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే మగ్గాల్సి వచ్చేది. మరి అప్పుడు నారా లోకేష్ అమిత్ షా ను కలిసినప్పుడు టిడిపి అనుకూల మీడియా ఏం రాసింది? వారిద్దరి కలయికను ఎలా సమర్థించింది? మరి ఇప్పుడు ఇదే జగన్ నరేంద్ర మోడీని కలిస్తే ఎందుకు ఆ స్థాయిలో రంకెలు వేస్తోంది? ఇది బుర్ర బద్దలు కొట్టుకునేంత చిక్కు ప్రశ్న ఏమీ కాదు. అలాగని జగన్ మోహన్ రెడ్డి సుద్దపూస అని చెప్పడం లేదు. ఆయన అనుకూల మీడియా స్వచ్ఛమైనది అనడం లేదు. కాకపోతే ఆయన మీడియా పార్టీ అనుబంధంగా పని చేస్తుంది అని గతంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అని ఇక్కడ టిడిపి అనుకూల మీడియానే న్యూట్రల్ ముసుగులో రాజకీయాలు చేస్తోంది. ఒక పార్టీకి అనుకూలంగా రాతలు రాస్తుంది. అంతే అంతకుమించి ఏమీ లేదు.