KTR : అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వినాలి. నిబంధన ప్రకారం నడుచుకోవాలి. ప్రభుత్వ విధానాలకు తగ్గట్టుగా విధి నిర్వహణ చేయాలి. అంటే తప్ప రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వినకూడదు. రాజకీయ నాయకులకు డూ డూ బసవన్నల లాగా మారకూడదు. ప్రజా ప్రతినిధులైనా.. పోలీస్ అధికారులైనా ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి. ఎందుకంటే ప్రజలు చెల్లించిన పన్నులతోనే వారికి జీతభత్యాలు అందుతున్నాయి.. కానీ ఈ విషయాన్ని మర్చిపోయిన కొంతమంది అధికారులు రాజకీయ నాయకుల సేవలో తరించిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు భజన చేస్తూ.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా భజంత్రీలు వాయిస్తూ తమ బానిసత్వాన్ని నిరూపించుకుంటున్నారు.
ఖమ్మం జిల్లాలో శుక్రవారం భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటించారు. ఇటీవల కన్నుమూసిన భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కుటుంబాన్ని ఆయన పరామర్శించడానికి వచ్చారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు రేగా కాంతారావు మాతృమూర్తి ఇటీవల కన్నుమూశారు. ఆమె దశదినకర్మకు కేటీఆర్ హాజరయ్యారు.. హైదరాబాద్ నుంచి ఖమ్మం రావడానికి ఆయన హెలికాప్టర్ ఉపయోగించారు. ఆయన వచ్చే హెలికాప్టర్ మమతా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగింది.. కేటీఆర్ కోసం భారత రాష్ట్ర సమితి నాయకులు ఎదురుచూస్తుండగా.. అందులో సివిల్ డ్రెస్ లో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు గులాబీ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అతడు తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడు. సివిల్ డ్రెస్ లో వచ్చిన అతడు కేటీఆర్ బందోబస్తు కోసం రాలేదు.. కేటీఆర్ కోసం భారత రాష్ట్ర సమితి నాయకులతో కలిసి అతను ఎదురుచూడడం పోలీసు వర్గాలను మాత్రమే కాదు.. అధికార పార్టీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది..
సదరు పోలీస్ అధికారి పేరు శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిసిఆర్బిలో సీఐ గా విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఆయన పనిచేస్తున్నారు. అయితే తన జిల్లాలో వదిలిపెట్టి కేవలం గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఆయన ఖమ్మం దాకా రావడం సంచలనం కలిగిస్తోంది. గతంలో ఆ పోలీసు అధికారి ఖమ్మం రూరల్ సిఐగా పని చేశారు. ఆయన పని చేసిన ఆ రోజుల్లో గులాబీ పార్టీ నాయకుల మాటలు విపరీతంగా వినేవారు. సిపిఐ నాయకులను దారుణంగా వేధించేవారు. అంతేకాదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు తొలిసారిగా ఖమ్మం వచ్చారు. వెంటనే ఆయన ఆ సీఐ శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాజకీయాలు చేయాలనుకుంటే పోలీస్ చొక్కా విప్పేసి వస్తే కచ్చితంగా దమ్మేందో చూసుకుందామని సాంబశివరావు శ్రీనివాస్ కు సవాల్ విసిరారు. అయితే ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన కొత్తగూడెం డి సి ఆర్ బి లో పనిచేస్తున్నారు.
కొత్తగూడెం డీ సీ ఆర్బీ లో పనిచేస్తున్న సిఐ ఖమ్మం రావడం.. సివిల్ డ్రెస్ లో గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి కోసం ఎదురు చూడటం సంచలనం కలిగించింది. అంతేకాదు భారత రాష్ట్ర సమితి నాయకులతో అతడు అత్యంత సన్నిహితంగా మాట్లాడటం.. కొంతమంది నాయకులతో చర్చలు జరపడం వివాదాస్పదమైంది.. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది? ఆ మధ్య సాంబశివరావు చెప్పినట్టుగా శ్రీనివాస్ ఖాకీ చొక్కా వదిలి గులాబీ కండువా కప్పుకుంటారా? వచ్చే స్థానిక ఎన్నికల్లో కీలక పదవి కోసం పోటీ చేస్తారా? అనే చర్చలు పోలీసు వర్గాల్లో సాగుతున్నాయి.