KTR: పార్టీలపరంగా మీడియా విడిపోయిన తర్వాత వ్యక్తిగత హననమే లక్ష్యం అవుతోంది. తర్కంతో సంబంధం లేకుండా ఆరోపణలు చేయడం.. మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా విమర్శ చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. అధికారంలో ఉన్న పార్టీలకు.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు భాజాలు ఊదే వ్యవస్థలుగా మీడియా మారిపోవడం తెలుగు నాట మారిన పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇది ఎంతవరకు వెళుతుంది? ఎక్కడి వరకు దారి తీస్తుంది? అనే విషయాలను పక్కన పెడితే పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఆ పార్టీ తనకంటూ సొంత మీడియా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సొంతంగా మీడియా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోకపోయినప్పటికీ.. దానికి అంతర్గతంగా సహకరించే మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి. ఆ మీడియా సంస్థలు రకరకాలుగా వార్తలు ప్రసారమవుతుంటాయి. అందులో సింహభాగం వార్తలు గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయి. అఫ్కోర్స్ గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ మీడియా సంస్థలకు ప్రకటనలు ఇవ్వలేదు అనేది ప్రధాన అభియోగం. దానిని నాడు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ నాయకులు సమర్ధించుకున్నారు. అయితే ఇప్పుడు తమకు గిట్టని మీడియా వ్యవస్థలు వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తే ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు.
ఇక ఇటీవల ఓ ఛానల్లో కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై డిబేట్ ప్రసారం అయింది. ఆ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుడు విటల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చలో భాగంగా మహాప్రస్థానం స్మశాన వాటికలో గులాబీ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయని.. అవి కేంద్రం చేతిలోకి వెళ్ళాయని.. ఆ తర్వాత రకరకాల పరిణామాలు చోటుచేసుకున్నాయని విటల్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు పూర్తిస్థాయిలో సమాచారం ఉందని.. అందువల్లే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు వెల్లడించారు. వాస్తవానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు డిబేట్ నిర్వహిస్తున్న వ్యక్తి వారించాలి. ఎందుకంటే కేటీఆర్ అనే వ్యక్తి సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఒక పార్టీకి కార్య నిర్వాహక అధ్యక్షుడు. అలాంటప్పుడు ఆయన మీద పూర్తి ఆధారాలు ఉంటేనే ఇటువంటి విషయాలు చెప్పాలి. అలాకాకుండా ఉబుసు పోని కబుర్లు చెబితే అంతిమంగా పరిణామాలు వేరే చోటు చేసుకుంటాయి. ఇటీవల ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కేటీఆర్ మీద అడ్డగోలుగా ప్రచారం చేస్తే గులాబీ పార్టీ కార్యకర్తలు దాడులకు దిగారు. వాస్తవానికి మీడియాపై దాడులకు దిగడం మంచి పరిణామం కాదు. అలాగని మీడియా అడ్డగోలుగా వార్తలను ప్రచారం చేయడం కూడా శుభ పరిణామం కాదు.