KTR : తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి సాగుతున్న మాటల యుద్ధం.. పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ ఎపిసోడ్‌తో చేతల వరకు వెళ్లింది. ప్రాంతీయ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తున్న అంశంపై ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్‌ఎస్ ఓటమి బాధతో ప్రాంతీయ విభేదాలను సృష్టించాలని, హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా మండి పడుతున్నారు. ఇక పక్షం రోజులుగా అమెరికా వెళ్లిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివరం ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అనుచరుల దాడిలో ధ్వంసమైన పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్‌రెడ్డితోపాటు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దెబ్బతిన్న ఇంటిని పరిశీలించారు. అనంతరం అక్కడే కౌశిక్‌రెడ్డితోపాటు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
రేవంత్ పగబట్టారట..
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను హైదరాబాద్ ప్రజలు తిరస్కరిచండంతో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను పగబట్టారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. రేవంత్ ఓ పనికిమాలిన సీఎం అని, పనికిమాలిన నాయకుడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో హైదరాబాద్ పదేళ్లు ప్రశాంతంగా ఉందని తెలిపారు. అందుకే హైదరాబాద్ ప్రజలు జీహెచ్‌ఎంసీ పరిధిలో తమకు పట్టం కట్టారన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా తెలంగాణ వాళ్లే అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని కేసీఆర్ పలుమార్లు చెప్పారని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో ప్రాంతీయతత్వం, ప్రాంతీయ భేదం లేదని స్పష్టం చేశారు.
కౌశిక్‌రెడ్డి మాటల్లో తప్పులేదట..
ఇక కౌశిక్‌రెడ్డి పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారు. కౌశిక్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని మాత్రమే కోరారని తెలిపారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. తాను పార్టీ మారానని అరికెపూడి గాంధీ బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అతనికి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కౌశిక్‌రెడ్డి ప్రశ్నిస్తే దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.
పోలీసులపై ఆగ్రహం..
కౌశిక్‌రెడ్డి ఇంటి వరకు అరికెపూడి గాంధీని పోలీసులే తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పరోక్షంగా పోలీసులు కారణమని ఆరోపించారు. ఇందుకు బదులు తీర్చుకుంటాంమని హెచ్చరించారు. పోలీసులను వదిలిపెట్టమన్నారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు రేవంత్‌రెడ్డిని వెంటాడతామని స్పష్టం చేశారు.