Tajikistan : పిల్లలకు హిజాబ్ నిషేధించాలని తజికిస్తాన్ దేశం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం దేశాలు డ్రెస్ కోడ్‌పై మర్యాదగా మాట్లాడుతుంటే.. తజికిస్థాన్ మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోంది. హిజాబ్ ధరించడం, గడ్డం పెంచుకోవడంపై నిషేధం విధించింది. వాటి స్థానంలో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రెహ్మాన్ హిజాబ్‌ను విదేశీ వస్ర్తంగా సంభోదిస్తున్నారు. అలాగే.. హిజాబ్‌ను బహిరంగ ప్రదేశాల్లో ధరించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. రెండు నెలల క్రితం దీనిపై పార్లమెంటులో తీర్మానం చేయడం చర్చకు దారితీసింది. హిజాబ్ ధరించడంతోపాటు అమ్మడం, కొనడం, ప్రచారం చేయడంపైనా నిషేధం విధించింది. ఎవరైనా స్త్రీలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆమెకు సుమారు 700 డాలర్ల జరిమానా విధించనున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ఇలా నిబంధనలు బ్రేక్ చేస్తే అంతకుమించిన ఫైన్ విధించనున్నారు.
రెహ్మాన్ ఒక్క హిజాబ్‌నే కాకుండా మతపరమైన ఆచారాలను నిషేధించారు. అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండువేలకు పైగా మసీదులను మూసివేసినట్లు ది డిప్లొమాట్ నివేదిక వెల్లడించింది. వాటిని కేఫ్‌లు, సినిమా హాల్స్, ఫ్యాక్టరీలు, సోషల్ వర్క్ సెంటర్లు మార్చిందట. ముందుగా రిజిస్ట్రేషన్ లేని మసీదులకు నోటీసులిచ్చి.. ఆ తరువాత అనధికార మత స్థలాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. 2020 సంవత్సరంలో ఈ దేశంలోని మొత్తం జనాభాలో 96 శాతం ముస్లింలే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెహ్మాన్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అయితే.. అధ్యక్షుడి నిర్ణయాల వెనుక పలు కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మతోన్మాదాన్ని తగ్గించడం, మిగిలిన ప్రపంచంతో కనెక్ట్ కావడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. అలాగే.. తొంబైలలో సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) నుంచి విడిపోయిన తరువాత.. తజికిస్థాన్‌లో అనేక ఛాందసవాదులు పుట్టుకొచ్చారు. వారు ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టేందుకు ఉవ్విళ్లూరారు. దాంతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు అక్కడ యుద్ధం నడిచింది. అప్పటికి రెహ్మాన్ రాజకీయాల్లో రాగా.. 1994లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఆయన చేస్తున్న రాజ్యాంగ సవరణలతో అధికారంలో కొనసాగుతూనే ఉన్నారు. మరోవైపు.. యుద్ధం సమయంలోనూ దేశానికి ఇస్తామిక్ సంస్థలు పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించాయని రెహ్మాన్ ఉద్దేశం. అందుకే దానిని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.