Konda Surekha Daughter: వెనకటికి ఇద్దరు వ్యక్తులు షావుకారు దగ్గరికి వెళ్తారు. అక్కడ కొనుగోలు చేసిన సరుకులకు డబ్బులు ఇచ్చే క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా వస్తుంది. అది కాస్త వివాదంగా మారుతుంది. చివరికి వారి పాత బాకీలు మొత్తం బయటపడతాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదేవిధంగా ఉంది పరిస్థితి. రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. దేవాదాయ శాఖను పర్యవేక్షిస్తున్న కొండా సురేఖ మధ్య ఏర్పడిన విభేదాలు తెలంగాణ రాజకీయాలలోనే కలకలం రేపుతున్నాయి.
మొన్నటిదాకా పొన్నం ప్రభాకర్ వర్సెస్ వాకిటి శ్రీహరి మధ్య గొడవలు ఉండేవి. మధ్యలో గడ్డం వివేక్ కూడా కలగజేసుకున్నారు. ఆ తర్వాత సారీ అనే పదంతో ఈ వివాదం సమసి పోయింది. ఆ గొడవ తగ్గుముఖం పట్టిందనుకుంటున్న క్రమంలో పొంగులేటి, సురేఖ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.. ఈ విభేదాలు కొండా సురేఖను తీవ్ర ఆవేదనకు గురిచేసాయి. దీంతో ఆమె మేడారం పనులకు సంబంధించి నిర్వహించిన సమీక్షకు హాజరు కాలేదు. ముఖ్యమంత్రి బుధవారం వరంగల్ వస్తే కనీసం మాటవరసకైనా ఆయనకు కనిపించలేదు. మొత్తంగా చూస్తే అటు ప్రభుత్వంపై.. ఇటు శ్రీనివాస్ రెడ్డి పై సురేఖ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగానే బుధవారం రాత్రి సురేఖ ఇంటి వద్ద చోటుచేసుకున్న హై డ్రామా తెలంగాణ రాజకీయాలలోనే కలకలం రేపింది. అయితే దీని అంతటికి ప్రధాన కారణం దక్కన్ సిమెంట్స్ లో కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డి సుమంత్ వేలు పెట్టడమే. దక్కన్ సిమెంట్స్ కంపెనీ నిర్వాహకులను సుమంత్ డబ్బులు డిమాండ్ చేశాడని స్వయంగా సురేఖ కుమార్తె సుస్మిత వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో శ్రీనివాసరెడ్డి తో జరిగిన వివాదం మేడారం పనులకు సంబంధించిందని.. ఓ ఎస్ డి పై తెలంగాణ ప్రభుత్వం తొలగింపు అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రధాన కారణం దక్కన్ సిమెంట్స్ నిర్వాహకులను డబ్బులు వసూలు చేయడానికి తేలింది. దీంతోపాటు ఉత్తమ కుమార్ రెడ్డి దక్కన్ సిమెంట్స్ నిర్వాహకులతో పోలీసులకు ఫిర్యాదు చేయించడం.. పోలీసుల సుమంత్ ను పట్టుకోడానికి రావడంతో ఒకసారిగా వివాదం ఏర్పడింది. పోలీసులు తన ఇంటికి వచ్చిన తర్వాత సురేఖ కుమార్తె తీవ్రంగా స్పందించారు. ఆవేశంలో అన్ని విషయాలు చెప్పారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
ఇదే అదునుగా గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. ఇటీవల కవిత ద్వారా ఇబ్బంది పడుతున్న ఆ పార్టీకి ఈ పరిణామం కాస్త ఉపశమనం కలిగించింది. అంతేకాదు వాటాలలో ఏర్పడిన పంచాయతీ వల్ల ఇదంతా జరుగుతోందని.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.