Shock to Konda Surekha: అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు. అడ్డగోలుగా వ్యవహరిస్తానంటే సాధ్యం కాదు. ముఖ్యంగా నోరును అదుపులోకి పెట్టుకోకుండా అదుపు లేకుండా వ్యాఖ్యలు చేస్తానంటే పరిస్థితి ఒప్పుకోదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు..
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లో కొండా సురేఖ టాలీవుడ్ దంపతుల విడాకుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితం పట్ల కూడా ఆరోపణలు చేశారు. వాటి వల్ల ఆమె అభాసు పాలయ్యారు. ఇప్పుడేమో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో వాగ్వాదానికి దిగారు. ఉత్తంకుమార్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. సురేఖ కుమార్తె సుస్మిత ఏకంగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారు.. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఇవన్నీ జరుగుతుండగానే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రత్యక్షంగా ఎటువంటి విమర్శలు చేయకుండా.. పరోక్షంగా తన పనులు తాను చేసుకుంటూ పోయింది.
పొంగులేటికి, సురేఖకు మధ్య వివాదానికి కారణమైన మేడారం జాతర పనుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ పనుల వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం చెక్ పెట్టింది. మేడారం పనులను పూర్తిగా ఆర్ అండ్ బీ శాఖకు అప్పగిస్తున్న నిర్ణయం తీసుకుంది.. 101 కోట్ల పనులను రోడ్లు భవనాల శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనుల బాధ్యత దేవాదాశాఖ ది అయినప్పటికీ.. టెక్నికల్, సూపర్ విజన్ ఇతర అంశాల ప్రామాణికంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ పనులకు సంబంధించిన అన్ని రికార్డులను ఆర్ అండ్ బి శాఖకు అప్పగించాలని ఎండోమెంట్ విభాగానికి సిఎస్ ఆదేశాలు జారీ చేయడం విశేషం.. ముఖ్యమంత్రిపై బుధవారం రాత్రి కొండ సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది..
కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు వీరంతా కలిసి తన తండ్రి మీద కేసులు పెడతారని.. తన తల్లిని రాజకీయంగా తొక్కివేస్తారని సుస్మిత ఆరోపించారు. సుస్మిత వ్యాఖ్యల తర్వాత గంటల వ్యవధిలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో సంచలనం కలిగిస్తోంది.