Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని మొత్తం హైజాక్ చేశాడు. సచివాలయం నుంచి మీడియా సంస్థలకు లీక్స్ ఇస్తున్నాడు. తన అనుకూల మీడియా సంస్థల్లో కథనాలను ప్రసారం చేయిస్తున్నాడు. మంత్రులను ఇబ్బంది పెడుతున్నాడు. వారిని వేధిస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ పోస్ట్ నుంచి పక్కన పెట్టడానికి రకరకాల స్టోరీలను టెలికాస్ట్ చేయించాడు. అదే మా కెసిఆర్ అయితే స్మిత సబర్వాల్ మీద ఔట్ లుక్ అనే మ్యాగజిన్ స్టోరీ పబ్లిష్ చేస్తే.. సర్కార్ సొమ్ముతో కోర్టులో కేసు వేయించాడు తెలుసా.. ఇదిగో ఇలా సాగుతోంది గులాబీ పార్టీ ప్రచారం.
వాస్తవానికి స్మితా సబర్వాల్ మీద రాసిన స్టోరీ కి, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్ను ను కోర్టు ఫీజుగా చెల్లించడానికి కెసిఆర్ ఎవరు? ముఖ్యమంత్రి అనంతమాత్రాన తనకి ఇష్టమైన అధికారులకు కోర్టు ఫీజులు చెల్లిస్తారా? ఇదే విషయంపై నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కదా.. ఆ విషయం గులాబీ పార్టీ పెద్దలకు తెలియదా? ఈరోజు ఇన్ని సుద్దులు చెబుతున్న గులాబీ పార్టీ.. నాడు మంత్రిగా ఉన్న రాజయ్య విషయంలో, రాజేంద్ర విషయంలో చేసింది ఏంటి? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
రాజయ్య మంత్రిగా ఉన్నప్పుడు నమస్తే తెలంగాణలో అంబులెన్స్ లో కొనుగోలులో కుంభకోణం అంటూ స్టోరీ రాసింది. ఆ తర్వాత రాజయ్యను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. దానికంటే ముందు రాజయ్య మీద గులాబీ పార్టీ అడ్డగోలు నెగిటివ్ ప్రచారం చేసింది. నాడు రాజయ్య తొలగింపు వెనక అంబులెన్సుల కుంభకోణం కాదని, అసలు విషయం వేరే ఉందని ఇప్పటికి గులాబీ నేతలే చెబుతుంటారు.
గులాబీ పార్టీకి ఓనర్లమని చెప్పినందుకు ఈటల రాజేందర్ మీద గులాబీ పార్టీ కరపత్రం నమస్తే తెలంగాణ ఎంత వ్యతిరేక కథనాలను ప్రసారం చేసిందో అందరికీ తెలుసు. నాడు ముఖ్యమంత్రికి కొంతమంది లేఖలు రాశారని.. ఆ భూములు అధికారులతో సర్వేలు కూడా నిర్వహించారు. ఈటెల రాజేందర్ కబ్జాకోరు అంటూ ముద్రవేశారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. చివరికి ఆయన గులాబీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.. వాస్తవానికి నచ్చని వ్యక్తులను బయటికి పంపించడంలో.. వారిపై అడ్డగోలుగా విమర్శలు చేయడంలో గులాబీ పార్టీ, ఆ పార్టీ అధినేత పీ హెచ్ డీ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ వ్యవహారంలో.. అంతకుముందు జరిగిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ బోధపడతాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
కోమటిరెడ్డి వ్యవహారం అనేది చాలా చిన్న విషయమని.. దానిని భూతద్దంలో పెట్టి చూస్తున్న గులాబీ పార్టీ.. గతంలో తన అధినేత ఏం చేశాడో గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నేతలు హితవు పలుకుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా గులాబీ పార్టీ మార్చుకుంటుందని.. మాకు నీతులు చెప్పేటప్పుడు ముందు తన కింది నలుపు చూసుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.