Komatireddy Raj Gopal Reddy: టీ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో అంతా కలిసి పనిచేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. దీంతో ఇక ఇప్పుడు పదవుల లొల్లి మొదలైంది. ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ లొల్లికి మరింత ఆజ్యం పోసింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి తలనొప్పిగా మారారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతోపాటు, రాష్ట్ర నాయకత్వం తనను అవమానిస్తోందని ఆయన ఆరోపిస్తూ, పలు సందర్భాల్లో పరోక్షంగా, ప్రత్యక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలను మరింత తీవ్రతరం చేస్తోంది.
Also Read: మునీర్ ఉగ్రవాద ప్రసంగంపై ప్రపంచ దేశాలు మౌనం అత్యంత ప్రమాదకరం
మంత్రి పదవి హామీ..
రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సమయంలో పార్టీ అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన పదేపదే ప్రస్తావిస్తున్నారు. భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంతోపాటు, మునుగోడు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తాను కీలక పాత్ర పోషించినా, హామీ నెరవేరలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలను స్వాగతిస్తూ, రాష్ట్ర నాయకత్వం తనకు అడ్డుపడుతోందని ఆరోపించారు. ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి వంటి నాయకులపై పరోక్షంగా చేస్తున్నారు. మరోవైపు ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఖమ్మం వర్సెస్ నల్గొండ…
రాజగోపాల్ రెడ్డి తాజాగా తన వాదనలో ఖమ్మం, నల్గొండ జిల్లాల మధ్య పోలికను తెరపైకి తెచ్చారు. ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉండగా, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు కూడా ముగ్గురు మంత్రులు ఉండటంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను కేవలం వ్యక్తిగత అసంతృప్తిగా పరిమితం చేయకుండా, మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి అన్యాయం జరుగుతోందనే కోణంలో మలిచారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల మునుగోడు అభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే, అది నాకు అన్యాయం జరిగినట్టే’’ అని ఆయన పేర్కొనడం ద్వారా, తన రాజకీయ లక్ష్యం పదవి కంటే ప్రజల సంక్షేమమేనని స్పష్టం చేశారు.
అంతర్గత కలహాలు..
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిపై ఆయన చేసిన విమర్శలు, సోషల్ మీడియా వేదికలపై ఆయన పరోక్ష దాడులు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. జానారెడ్డిని ‘‘ధృతరాష్ట్రుడు’’గా పోల్చడం, రేవంత్ రెడ్డి దీర్ఘకాల సీఎం పదవి వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వడం వంటివి ఆయన ధోరణిని స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ విమర్శలు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచడంతోపాటు, రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మార్చాయి. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.