Komati Reddy Venkat Reddy: రాజకీయాలలో ఎప్పుడు శాశ్వతమైన శత్రువులు ఉండరు. అలాగే మిత్రులు కూడా ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉదాహరణలు పై నానుడిని నిజం చేశాయి. ఇప్పుడు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదంతంతో మరోసారి ఆ నానుడి నిజమైంది. మీడియాలో కథనాలు.. కొన్ని పత్రికలలో స్టోరీలు.. ఇవన్నీ కలిసి కోమటిరెడ్డిని కన్నీటి పర్యంతం చేశాయి. చివరికి ఆయన వైరాగ్యం ప్రదర్శించే స్థాయికి వెళ్లిపోయాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ నాయకుడి కంటే ముందు ఒక కాంట్రాక్టర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత తనకంటూ నల్గొండ జిల్లాలో ఒక బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిలో తన తన వంతు పాత్ర పోషించారు. ఇదే క్రమంలో ఆయన తన కుమారుడు ప్రతిక్ రెడ్డిని కోల్పోయారు. కుమారుడి మరణం వెనుక అనేక కథనాలు ఉన్నాయి. కానీ ఏనాడు కూడా వెంకటరెడ్డి తన కుమారుడి మరణాన్ని రాజకీయం కోసం వాడుకోలేదు. తన కుమారుడు చనిపోయినప్పటికీ అతడి పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఎంతోమంది చదువుకు.. ఉపాధి కోసం సహాయం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. నిరవధికంగా నిరాహార దీక్ష కూడా చేశారు. తెలంగాణ వెంకన్నగా మారిపోయారు. అటువంటి వ్యక్తి నేడు స్వరాష్ట్రంలో సొంత పార్టీ అధికారంలో ఉండడం, మంత్రిగా ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వైరాగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.
వెంకటరెడ్డి పై ఇటీవల ఎన్ టివిలో ఒక కథనం ప్రకారం అయింది. వాస్తవానికి ఆ కథనంలో ఆ చానల్ ప్రసారం చేసిన విషయాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. రెండవ స్థానంలో ఉన్న ఆ చానల్ ఇంతటి బి గ్రేడ్ స్థాయి కథనాన్ని ప్రసారం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. పైగా ఆ ఛానల్ ప్రసారం చేసిన కథనాన్ని గులాబీ మీడియా, సోషల్ మీడియా తమకు అనుకూలంగా వాడుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అడ్డగోలుగా రాశాయి. దీనికి తోడు సదరు మహిళా అధికారి కూడా తీవ్రంగా కలత చెందారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారుల సంఘం ఒక లేఖ కూడా రాసింది. ఆ ఛానల్ తన స్టోరీని డిలీట్ చేయాలని కూడా కోరింది. లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.
ఈ లేక తర్వాత వెంకటరెడ్డి విలేకరుల ముందుకు వచ్చారు. కన్నీటి పర్యంతమయ్యారు. తన మీద కక్ష తీరకపోతే ఇంత విషం ఇచ్చి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా తెలంగాణ రాజకీయాలలో సంచలనం కలిగించింది. వాస్తవానికి ఇటువంటి పరిణామం జరుగుతుందని వెంకట్ రెడ్డి అనుచరులు అంచనా వేయలేదు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒకసారిగా తెలంగాణ రాజకీయాలలో కలకలం నెలకొంది. అంతేకాదు, సినిమా టికెట్ ధరల పెంపు విషయం తన పరిధిలో లేదని.. అటువంటి వాటికోసం తన వద్దకు రావద్దని సినీ పరిశ్రమ పెద్దలకు చెప్పానని వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది…
పుష్ప సినిమా వ్యవహారం తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు విడుదల కార్యక్రమాలకు, టికెట్ ధరల పెంపుదలకు అవకాశం వేయలేదని స్పష్టం చేశారు. ఆ ఆ మాట మీద ముఖ్యమంత్రి నిలబడలేకపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు టికెట్ ధరలను పెంచుకుంటూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. అయితే ఈ జీవోలు తాను ఇవ్వలేదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇటీవల మన శంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించి కూడా టికెట్ ధరల పెంపుదల చోటు చేసుకోవడంతో వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరల పెంపుదలకు తాను ఎంత మాత్రం ఒప్పుకోనని మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను పెంచుతున్న ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మరోసారి చర్చ మొదలైంది. ఓ బడా నిర్మాత, ప్రభుత్వంలోని కీలక నాయకుడికి దగ్గరి వ్యక్తి టికెట్ ధరల పెంపుదలను డిసైడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజా సాబ్ సినిమాకు దక్కని అవకాశం, మన శంకర వరప్రసాద్ సినిమాకు దక్కడానికి కారణం వాళ్ళిద్దరిననే చర్చ నడుస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఎన్ టీవీ ప్రసారం చేసిన కథనం, టికెట్ ధరల పెంపుదల వ్యవహారం మొత్తానికి తెలంగాణ మంత్రి వెంకటరెడ్డికి ఇబ్బంది కలిగించింది. విషం ఇచ్చి చంపమనే స్థాయికి చేరింది. మరి ఈ వ్యవహారానికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాల్సి ఉంది.