CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీ హామీలతోపాటు మేనిఫెస్టోలోనూ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా ఏ హామీ పూర్తిగా అమలు చేయడం లేదు. మహాలక్ష్మి పూథకంలో కేవలం ఉచిత బస్సు సదుపాయం, రూ.500 లకే గ్యాస్ అమలవుతోంది. ఇక గృహ లక్ష్మిలో ఉచిత విద్యుత్ అమలవుతోంది. రైతు రుణాలు మాఫీ చేసినా రైతు భరోసా చెల్లించలేదు. పెన్షన్లు పెరగలేదు. ప్రతీ మహిళకు ఇస్తామన్న రూ.2,500 చెల్లించడం లేదు. ఇందిరమ్మ ఇళ్లు కేటాయించలేదు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. కొన్ని పథకాలతోనే ఏడాది పాలన పూర్తయింది. హామీల అమలుకు ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికకు సర్వే ప్రారంభించింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సర్వే చేస్తున్నారు. వివరాలను ఆయాప్‌లో నమోదు చేస్తున్నారు. అయితే సర్వే నెమ్మదిగా సాగుతోంది. దీంతో సర్వే పూర్తి కావడానికి ఇంకా నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ పథకంలోపాటు భూభారతి పథకంపైనా సమీక్ష చేయాలని నిర్ణయించారు.
నేడు రేవంత్ సమీక్ష..
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు చేపట్టిన సర్వేపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం(డిసెంబర్ 23న) సమీక్ష చేయాలని నిర్ణయించారు. సంక్రాతి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సర్వే తీరుపై సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే గ్రామ కమిటీలలో లబ్ధిదారుల ఎంపికకు అంతా సిద్ధం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రభుత్వం అందించనుంది. దీనికి సబంధించి ఇప్పటికే యాప్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికతోపాటు ఇళ్ల మంజూరు త్వరగా చేపట్టాలని సీఎం ఆదేశించనున్నారు.
సొంత స్థలం ఉన్నవారికే..
పథకంలో భాగంగా తొలి విడతలో స్థలం ఉన్నవారికే ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించనున్నారు. లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నారు. ఈమేరు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సంక్రాంతి నుంచి లబ్ధిదారుల ఎంపిక, నిధుల కేటాయింపు చేసే అవకాశం ఉంది. తాజా సమీక్షలో లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎన్ని విడతల్లో ఇవ్వాలని ఎలా ఇవ్వాలి అనే విధివిధానాలు కూడా రూపొదించే అవకాశం ఉంది.
భూ భారతిపైనా..
ఇక ధరణి స్థానంలో కొత్తగా తీసుకువచ్చే భూ భారతిపైనా సీఎం సమీక్ష చేయనున్నారు. భూ భారతి అమలుతో ధరణి సమస్యల పరిష్కారం, అధికారాల వికేంద్రీకరణ, కబ్జాల గుర్తింపు, ఇప్పటికే ఆక్రమణకు గురైన భూములను తిరిగి ఎలా స్వాధీనం చేసుకోవాలి అనే అంశాలపైనా అధికారులతో సమీక్షిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ భూముల నమోదు ఎలా చేపట్టాలి. వాటి రక్షణకు ఎలాంటి చర్చలు చేపట్టాలో కూడా చర్చించే అవకాశం ఉంది.