Allu Arjun: సంధ్య థియేటర్ ఎపిసోడ్ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాడు పుష్ప -2 ప్రీమియర్ షో సందర్భంగా ఏం జరిగింది? అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఎన్ని వాహనాలు వచ్చాయి? అభిమానులు ఒకేసారి ఎందుకు అంతలా వచ్చారు? రేవతి ఎలా చనిపోయింది? సీఐ రాజు నాయక్ ఈ విషయాన్ని చెప్పడానికి పడిన ఇబ్బంది.. ఇలా అన్ని విషయాలను సివి ఆనంద్ వివరించారు. ఈ క్రమంలో నేషనల్ మీడియా తీరును ఆయన తప్పు పట్టారు.. నేషనల్ మీడియా అల్లు అర్జున్ ను వెనకేసుకురావడానికి ప్రయత్నించిందని.. తెలంగాణ పోలీసులను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా వార్తలు ప్రసారం చేసిందని సివి ఆనంద్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నేషనల్ మీడియా విలేకరులు సంధిస్తున్న ప్రశ్నలకు ఆయన ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నేషనల్ మీడియా విలేకరులపై ఆయన మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న నేషనల్ మీడియా విలేకరులు నిరసన వ్యక్తం చేశారు. సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాము ఎక్కడ ఆశ్రిత పక్షపాతం వహించామో చెప్పాలని.. దానికి రుజువులు చూపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ ముగిసిన అనంతరం సివి ఆనంద్ వేదిక దిగి వస్తుండగా.. నేరుగా ఆయనతోనే వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని అలాంటి మాటలు ఎలా అంటారంటూ మండిపడ్డారు. అయితే వారు అడిగిన ప్రశ్నలకు సివి ఆనంద్ నేరుగా సమాధానం చెప్పలేక.. అదే స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ వెళ్లిపోయారు.
నేషనల్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించడంతో..
సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యల పట్ల నేషనల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం నుంచి సీవీ ఆనంద్ టార్గెట్ గా వార్త కథనాలను ప్రసారం చేసింది. అల్లు అర్జున్ వ్యవహారంలో.. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తన కథనాలలో ప్రస్తావించింది. ఇవి కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో.. సీవీ ఆనంద్ స్పందించక తప్పలేదు. ఈ క్రమంలోనే ఆయన ఒక కీలక ప్రకటన చేశారు..” అల్లు అర్జున్ కేసు వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో ఎటువంటి ప్రకటనలకు అవకాశం లేదు.. కాకపోతే నిన్న ఈ కేసు కు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్న సమయంలో కొంతమంది జాతీయ మీడియా విలేకరులు పదేపదే నా సహనాన్ని పరీక్షించారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు వేశారు. అది నా సహనాన్ని ఇబ్బంది పెట్టింది. దీంతో నేను నిగ్రహాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో నేను జాతీయ మీడియా విలేకరులపై ఆగ్రహాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. ఈ విషయంలో వారు ఏమైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించాలి. నా ఉద్దేశం వారిని తప్పు పట్టడం కాదు. ఆ సమయంలో నేను నా నిగ్రహాన్ని కోల్పోయాను. అందువల్లే అలాంటి వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యలు వారిని ఇబ్బందికి గురి చేస్తే క్షమించాలని కోరుతున్నానని” సీవీ ఆనంద్ పేర్కొన్నారు.