తెలంగాణ ప్రజలకు కీలక సూచన చేసింది వాతావరణశాఖ. గులాబ్ ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గులాబ్ ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఇద్దరు అధికారులతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ లో రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్లొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీం, జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమంత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
గులాబ్ తుపాను సోమవారం సాయంత్రానికి వాయుగుండగా బలమీనపడిందని, మంగళవారం ఉదయం నుంచి దాని ప్రభావం తగ్గిపోతుందని పేర్కొంది. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని తెలిపింది. నైరుతి సీజన్ లో సాదరణంగా ఇప్పటి వరకు 70.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంతని.. సాధారణ వర్షపాతం కంటే ఇది 35 శాతం అధికమని తెలిపింది. ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లలో అధికం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొంది.