KCR: సవాళ్లను అధిగమించడం.. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ దిట్ట. రాజకీయ వ్యూహాలు రచించడంలో, ఎత్తుకు పైఎత్తు వేయడంలో నేర్పరి. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కేసీఆర్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. నేర్పరితనం పనిచేయడం లేదు. ఎన్నిల్లో తీసుకున్న నిర్ణయాలు బూమరాంగ్ కావడంతో మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. ప్రతిపక్షానికి పరిమితమవ్వడమే కాకుండా.. విపక్ష నేతగా తీసుకుంటున్న నిర్ణయాలు విఫలమవుతున్నాయి. అధికారం కోల్పోయిన డిప్రెషన్‌లో కేసీఆర్ చాణక్యం పనిచేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్ ఇరుకున పెట్టేందుకు ఎంచుకున్న అస్త్రాలన్నీ విఫలం అవుతున్నాయి. తాజాగా రైతు రాజకీయం బూమరాంగ్ అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసీఆర్ పొలం బాట..
కరువుకు కాంగ్రెస్ కారణం అని బదనాం చేయడంతోపాటు రైతులను ఆదుకోవాలనే డిమాండ్‌తో కేసీఆర్ రైతు రాజకీయం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆయన పొలం బాట పట్టారు. ఏప్రిల్ 2న మూడు జిల్లాల్లో పర్యటించిన గులాబీ బాస్.. శుక్రవారం(ఏప్రిల్ 5న) కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్ ప్రకటించాలని, పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ వైఫల్యాలను గుర్తు చేస్తున్న డిమాండ్లు..
అయితే కేసీఆర్ డిమాండ్లు బాగానే ఉన్నా.. అవి ఆయన వైఫల్యాలనే రైతులకు గుర్తు చేస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.లక్ష రుణమాఫీ, నిరుద్యోగులకు రూ.3 వేల భృతిని గుర్తుకు తెస్తున్నాయి. ఐదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయని కేసీఆర్.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేయమనడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక మద్దతు ధర కోసం రోడ్డు ఎక్కిన రైతులకు బేడీలు వేయించిన కేసీఆర్ ఇప్పుడు రూ.500 బోనస్ అడగడంపై రైతులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏనాడు స్పందించని బీఆర్‌ఎస్ నేతల తీరును గుర్తు చేస్తున్నారు. రైతు ఆత్మహత్యలను వ్యక్తిగత ఆత్మహత్యలుగా నమోదు చేయాలని పోలీసులకు జారీ చేసిన ఆదేశాలనూ ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
అధికారంలో ఉంటే అలా.. కోల్పోయాక ఇలా..
అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోకుండా అధికారం కోల్పోగానే ఇప్పుడు పొలంబాట పట్టడంపై రైతులే విమర్శలు చేస్తున్నారు. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరువు కాపాడుకునేందుకే కేసీఆర్ రైతు రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఫామ్‌హౌస్, ప్రగతి భవన్ విడిచి రాని కేసీఆర్, రైతుబీమా రూ.5 లక్షలు ఇస్తున్నామని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మాత్రం రైతుల కోసం పోరాడుతున్నట్లు డ్రామా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మొత్తంగా 2023 నవంబర్ నుంచి బీఆర్‌ఎస్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఆ పార్టీ ఏం చేసిన వేలెత్తి చూపేలా ఉన్నాయి. కేసీఆర్ సర్కార్‌కు పదేళ్లు వెన్నుదన్నుగా ఉన్న రైతులే మొన్నటి ఎన్నికల్లో ఓడించారు. తాజాగా రైతుబాటపైనా పెద్దగా స్పందించకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.