KCR : తెలంగాణలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. రెండు సార్లు గెలిచి అధికారాన్ని చెలాయిస్తున్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం.. మూడో సారీ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. అయితే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా ఇన్ని రోజులు నిర్లక్ష్యం ప్రదర్శించి ఇప్పుడు జనాకర్షక నిర్ణయాలు తీసుకుంటోంది. రైతుల రుణాల మాఫీ, ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటివి ఈ కోవలోనివే. ఇవి చాలవనుకున్నారో ఏమో తెలియదు కాని ముఖ్యమంత్రి కేసీఆర్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు.
ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు కేసీఆర్. ఇందులో కొన్ని బాగుంటే మరికొన్ని బాగోలేవు అనే విమర్శలు ఉన్నాయి. ధరణి, వీఆర్‌ఏల వ్యవస్థ రద్దు వంటివి ఆ కోవలోనివే. వీఆర్‌ఏల ను పలు శాఖల్లో సర్దుబాటు చేశారు. తాజాగా, అది కూడా ఎన్నికలకు మరో మూడు నెలలు ఉందనగా రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పు చేపట్టేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో ఆర్డీవో(రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్) వ్యవస్థను రద్దు చేయబోతున్నట్టు సమాచారం. అయితే వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది ఉత్కంఠగా మారింది.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం తెలంగాణలో త్వరలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన రెవెన్యూ డివిజనల్ అధికారి పోస్టులను కాలగర్భంలో కలిపేయనుంది. ఇప్పటికే వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా రెవెన్యూ డివిజన్ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ఉంది. రాష్ట్రంలో 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇందులో 90 మంది దాకా ఆర్డీవోలు పని చేస్తున్నారు. ప్రభుత్వం వీరికి ఇటీవల ప్రమోషన్లు కూడా ఇచ్చింది. అయితే వీరందరికీ కొత్త పోస్టులు ఇవ్వాలని యోచిస్తోంది. అయితే వీరిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్ లు ఆసుపత్రి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే వారి మీద పని భారం పెరగడంతో ఆసుపత్రుల నిర్వహణ గాడి తప్పుతోంది. వారికి అదనంగా ఆర్డీవోలను నియమించడం ద్వారా ఆసుపత్రుల నిర్వహణ బాగుండటం, రోగులకు సత్వరమైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 3000 పడకలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆసుపత్రికి వచ్చే రోగికి వైద్య సేవలు ఎక్కడ అందుతున్నాయి? వైద్య సేవలు అందని పక్షంలో ఎవరిని సంప్రదించాలో తెలియక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి ఆడ్మినిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికి ఆర్డీవోలను నియమించే అవకాశం కన్పిస్తోంది.
ఇప్పటికే దీనిపై శాసన మండలిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సూత్రప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా జబ్బు పట్టి, నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిన ఆరోగ్య శాఖకు సర్కారు తీసుకొస్తున్న ట్రీట్‌మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో మరి. కాగా, సర్కారు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకున్న కొందరు ఆర్డీవోలు పెదవి విరుస్తున్నారు. తమను ఆరోగ్య శాఖలోకి పంపిస్తే రెవెన్యూ సమస్యలను ఎవరితో పరిష్కరిస్తారు అనే సందేహం లేవనెత్తుతున్నారు.