KCR Health: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుక్రవారం యశోద ఆస్పత్రిలో నిర్వహించిన తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి డాక్టర్లు ఈ ఆపరేషన్ ను సక్సెస్ చేశారు. బాత్రూంలో జారి పడిన కేసీఆర్ ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించగా.. పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ అవసరమైన నిర్ధారించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆపరేషన్ ప్రారంభించారు.
నడక ప్రాక్టీస్..
హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి అయ్యింది. దీంతో శనివారం ఉదయం కేసీఆర్ తో వైద్యులు నడక ప్రాక్టీస్ చేయించారు.. ఇద్దరు వైద్యులు ఆయన్ను పట్టుకోగా.. వాకర్ సాయంతో కాలు కదుపుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు.
ఆపరేషన్ కు సహకరించిన శరీరం..
కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్సపై యశోద ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో ఆయనకు నిర్వహించిన సర్జరీ విజయవంతం అయినట్లు డాక్టర్లు వెల్లడించారు. కేసీఆర్ ఎడమ తుంటికి నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు ఆయన శరీరం బాగానే సహకరించిందని వారు తెలిపారు. ఆస్పత్రిలోని సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్లు, అనస్తీషియాలజిస్టులు, నర్సులతో కూడిన బృందం ఆయనకు ఈ సర్జరీ నిర్వహించినట్లు వారు తెలిపారు.
6 నుంచి 8 వారాల్లో కోలుకునే ఛాన్స్..
సర్జరీ పూర్తి చేసుకున్న కేసీఆర్ సాధారణంగా పూర్తిగా కోలుకునేందుకు మరో 6 నుంచి 8 వారాలు పడుతుందని అంచనా వేసినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే ఈ ఆరు నుంచి ఎనిమిది వారాలు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలా లేక మధ్యలో డిశ్చార్జ్ చేసి పంపిస్తారా అన్నది మాత్రం డాక్టర్లు హెల్త్ బులిటన్ లో వెల్లడించలేదు. నడక ప్రాక్టీస్ తర్వాత డిస్చార్జ్ చేస్తారని తెలుస్తోంది.
Fighter will come out soon …#KCR ✊ pic.twitter.com/y1buaxiZ77
— Krishank (@Krishank_BRS) December 9, 2023