Telangana Politics: తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించేది ఎవరు? భారతీయ రాష్ట్ర సమితా? భారతీయ జనతా పార్టీయా? సంఖ్యా బలంలో బిఆర్ఎస్ ముందు వరుసలో ఉంది. బిజెపి సైతం గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంది. అయితే బిఆర్ఎస్ కంటే బిజెపి గట్టి వాయిస్ వినిపించనుందని.. ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయస్థాయిలో బిజెపి, కాంగ్రెస్ వైరి వర్గాలుగా ఉన్నాయి. దశాబ్దాల వైరం వారిది. ఈ తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అన్నది బిజెపి అభిప్రాయం. అవసరమైతే బిఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు కానీ.. కాంగ్రెస్ గెలవకూడదుఅని బిజెపి భావించింది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఈ తరుణంలో అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించి 2028 ఎన్నికల్లో సత్తా చాటాలని బిజెపి భావిస్తోంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది.
అయితే ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయం పై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించనున్నారు. ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాలన్న యోచనలో భాగంగా అక్బరుద్దీన్ ఓవైసీ ని ప్రొటెమ్ స్పీకర్ గా ఎంపిక చేశారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా ప్రొటెమ్ స్పీకర్ సభ్యులందరితో ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ పదవి చెల్లుబాటులో లేకుండా పోతుంది. అక్కడ నుంచి స్పీకర్ యధావిధిగా కార్యకలాపాలను ప్రారంభిస్తారు. అటువంటి ప్రొటెం స్పీకర్ పోస్ట్ కు అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
ఖాసీం రాజ్వీ వారసుడైన అక్బరుద్దీన్ ఎదుట తాము ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసేది లేదని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజాగా ప్రకటించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు తొలిరోజు సభకు హాజరు కారని తేల్చి చెప్పారు. ముస్లిం వ్యతిరేకత అనే అంశమే తమ ఓటు బ్యాంకుకు బలమైన పునాది అన్నట్లుగా బిజెపి భావిస్తోంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. మున్ముందు సైతం బిజెపి ఇదే పంధాను కొనసాగించనుంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ కంటే దూకుడుగా వ్యవహరించనుంది. తద్వారా తెలంగాణలో బలం పెంచుకోవాలన్న భావనతో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.