https://oktelugu.com/

KCR: కేసీఆర్‌ స్వయంకృతాపరాధం.. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి..!

బీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే అన్నీ కేసీఆరే.. కాకపోతే హరీశ్‌రావు, కేటీఆర్‌ తర్వాత తన నిర్ణయంపై చర్చించే మరో నేత కే.కేశవరావు. చాలా కీలక నిర్ణయాలను కేసీఆర్‌ కేశవరావుతో పంచుకునేవారు.

Written By: , Updated On : March 29, 2024 / 12:00 PM IST
KCR

KCR

Follow us on

KCR: రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడి. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఈ నానుడి సరిగ్గా సరిపోయేలా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు.. ఇప్పుడు ఆయనకే తిప్పి కొడుతున్నాయి. ఎవరి సలహాలు తీసుకోకుండా చేసిన తప్పులు ఇప్పడు ఆయనను తిప్పలు పెడుతున్నాయి. ఏ పార్టీలో అయినా కీలక నేతలు ఇద్దరు ముగ్గురు అనుచరులను, నమ్మకస్తులను పెట్టుకుంటారు. తాము తీసుకునే నిర్ణయంపై వారితో చర్చించి ఫైనల్‌ చేస్తారు. బీజేపీలో అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు, మోదీ, అమిత్‌షా కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. వైసీపీలో జగన్‌తోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మరో ఇద్దరు ముగ్గురు కలిసి తుది నిర్ణయానికి వస్తారు.

బీఆర్‌ఎస్‌లో అన్నీ ఆయనే..
ఇక బీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే అన్నీ కేసీఆరే.. కాకపోతే హరీశ్‌రావు, కేటీఆర్‌ తర్వాత తన నిర్ణయంపై చర్చించే మరో నేత కే.కేశవరావు. చాలా కీలక నిర్ణయాలను కేసీఆర్‌ కేశవరావుతో పంచుకునేవారు. కానీ తుది నిర్ణయం మాత్రం కేసీఆర్‌దే. అభ్యర్థుల ఎంపికతోపాటు, పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలన్నీ కేసీఆర్‌ ఫైనల్‌ చేస్తారు. కేసీఆర్‌ బలాలు, బలహీనతలు కూడా కేశవరావుకు తెలుసు.

హ్యాండ్‌ ఇచ్చిన కేకే..
ఇలా కేసీఆర్‌ బలం, బలహీనత తెలిసిన కేకే ఇప్పుడు కేసీఆర్‌కు హ్యాండ్‌ఇచ్చారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఎదిగిన మాజీ కాంగ్రెస్‌ నేత కేకేనే తిరిగి సొంత పార్టీలోకి తీసుకువచ్చేందుకు స్కెచ్‌ వేసింది. దీంతో తాచుపాములా ఉన్న బీఆర్‌ఎస్‌.. వానపాములా మారుతుందని రేవంత్‌ ఆలోచన. ఈ స్కెచ్‌ వర్కవుట్‌ అయింది. కాంగ్రెస్‌ ఆకర్ష్‌కు కేకే అట్రాక్ట్‌ అయ్యారు. ఇంకేముందు పార్టీని వీడుతున్నట్లు పదేళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారు.

ఉద్యమకారులను కాదని..
ఇక కేసీఆర్‌ చేసిన మరో తప్పిదం ఏమిటంటే.. అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులను విస్మరించారు. వలసలను ప్రోత్సమించడమే కాకుండా పదవులు కట్టబెట్టారు. సమైక్య వాదులుగా గుర్తింపు ఉన్న కేకే, దానం, తలసాని వంటి వారిని పార్టీలో చేర్చుకుని పదవులు ఇచ్చారు. దీనిపై అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అధికారం ఉన్నంన్ని రోజులు కేసీఆర్‌తో సఖ్యతగా ఉన్న నేతలు, పదవులు అనుభవించారు. ఇప్పుడు మళ్లీ అధికార పార్టీ కోసం ఇన్నాళ్లూ పువ్వుల్లో పెట్టుకుని చూసిన పార్టీనీ కాదంటున్నారు. చివరకు ఇంత నమ్మిన కేకే.. హ్యాండ్‌ ఇవ్వడంతో కేసీఆర్‌ ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి.