Summer: వేసవి ముదురుతోంది. ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచి సెగలు కక్కుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. ఉక్కపోత సైతం ప్రారంభమైంది. నిన్న ఉత్తర కోస్తా తో పాటు రాయలసీమలో 31 మండలాల్లో వడగాలులు వీచాయి. రాయలసీమలో ఏకంగా 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇప్పుడే ఇలా ఉంటే మే, జూన్ లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థమయిపోతుంది.
మార్చి చివరి వారంలోనే ఇలా ఉంది. ఏప్రిల్ నుంచి ఎండల తీవ్రత అమాంతం పెరగనుందని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పుల ప్రభావం చూపునున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ హెచ్చరించారు. ఈరోజు 42 మండలాల్లో, రేపు 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాలలో 42 డిగ్రీలు, కర్నూలులో 41.9, కడపలో 41.2, అనంతపురంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు విషయంలో ప్రజలను అలెర్ట్ చేసింది. కడప జిల్లాలో 18 మండలాలు, నంద్యాలలో 8 మండలాలు, పార్వతీపురం మన్యంలో 8 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో ఆరు మండలాలు, గుంటూరు జిల్లాలో ఒక మండలం, పల్నాడులో ఒక్క మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వడ దెబ్బ తగిలి అవకాశమున్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ఎన్నికల సీజన్ కావడంతో ముఖ్యంగా రాజకీయ పక్షాలకు ఈ వడదెబ్బ తగలనుంది. ఎన్నికల ప్రచారానికి ఇబ్బందిగా మారనుంది.