Congress: పార్లమెంటు ఎన్నికల వేళ.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సుమారు పదేళ్లు తెలంగాణను ఏలిన బీఆర్‌ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ పార్టీకి కీలక నేతలు గుడ్‌బై చెబుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే గేట్లు తెరిచామని ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మేము గేట్లు తెరిస్తే.. బీఆర్‌ఎస్‌లో నలుగురే మిగులుతారని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పరిస్థితి చూస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందే చేరికలు..
కాంగ్రెస్ గేట్లు ఎత్తడం.. బీఆర్‌ఎస్ నేతలు ఎప్పుడు చేరదామా అని చూస్తుండడం హస్తం పార్టీకి ఊపు తెస్తోంది. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో లోక్‌సభ సీట్లు పెరుగుతాయని, క్యాడర్‌లో జోష్ వస్తుందని ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఎన్నికలకు ముందే దెబ్బతీయాలని..
లోక్‌సభ ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ను నైతికంగా దెబ్బతీయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈమేరు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరికొందు కూడా రేవంత్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చేరికలను ప్రోత్సహించడం ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీని ఏకకాలంలో వీక్ చేయవచ్చని సీఎం ప్లాన్ చేస్తున్నారు.
9 మంది రెడీ..
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన వారే అని సమాచారం. వీరితోపాటు మరికొందరిని ఆకర్షించడం ద్వారా బీఆర్‌ఎస్ ఎల్పీనే విలీనం చేయవచ్చన్న ఆలోచన కూడా సీఎం రేవంత్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోతారన్నది కాంగ్రెస్ ఆలోచన.