HomeతెలంగాణCM Revanth Reddy: విజయవాడ.. 66 కోట్లు.. రేవంత్ చెప్పిన కేసీఆర్ కార్ల కహానీ!

CM Revanth Reddy: విజయవాడ.. 66 కోట్లు.. రేవంత్ చెప్పిన కేసీఆర్ కార్ల కహానీ!

CM Revanth Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అదే అధికారం కోల్పోతే గతంలో చేసినవన్నీ తిరగబడతాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ నుంచి గతంలో అధికారంలో ఉన్న గులాబీ రాష్ట్ర సమితికి ఇటువంటి పద ఘట్టనలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ మీద.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంత మేరకు బొక్క పడింది అనేది కాంగ్రెస్ పార్టీ లెక్కలతో సహా వివరించింది. ఏకంగా శ్వేత పత్రాలను విడుదల చేసింది. దీనికి కౌంటర్ గా భారత రాష్ట్ర సమితి శ్వేత పత్రాలు విడుదల చేసింది. ఈ సంగతి అటు ఉంచితే బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా కెసిఆర్ కార్ల కహాని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అటు మీడియాలోనూ.. ఇటు ప్రజల్లోనూ చర్చ మొదలైంది.

సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ పకడ్బందీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ లో 22 వాహనాలు ఉండేవి. అవి కూడా అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. అయితే ఇందులో కొన్ని వాహనాలను భారత రాష్ట్ర సమితిలోని కొంతమంది నాయకులు వాడేవారు. ముఖ్యమంత్రి బాధ్యత దృష్ట్యా వాహనాలను ఎప్పటికప్పుడు ఆధునికరిస్తారు. అయితే ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ల్యాండ్ క్రూయిజ్ షోరూం కు భారీ ఆర్డర్ ఇచ్చింది. 22 వాహనాలు కావాలని, వాటికి బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం ఉండాలని చెప్పింది. ఈ ఆదేశాల వెనుక కేసీఆర్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. మూడోసారి కూడా తనే అధికారంలోకి వస్తానని భావించిన కేసీఆర్.. తన వాహన శ్రేణి అత్యంత ఆధునికంగా ఉండాలని ఈ ఆర్డర్ అధికారుల ద్వారా ఇప్పించినట్టు సమాచారం. అయితే ఒక్కొక్క వాహనానికి మూడు కోట్లు చొప్పున 66 కోట్లు ప్రభుత్వం ఆ కంపెనీకి చెల్లించింది. అధికారంలోకి రాగానే విజయవాడ నుంచి ఆ వాహనశ్రేణి తెలంగాణకు రప్పించి దానిని వినియోగించాలని కెసిఆర్ అనుకున్నారు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. అధికారంలోకి రావాలి, హ్యాట్రిక్ కొట్టాలి అనుకున్న కేసీఆర్ కలలు నెరవేరలేదు.

అయితే బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుంబ దోపిడీ గురించి వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పనిలో పనిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డర్ ఇచ్చిన ల్యాండ్ క్రూయిజ్ స్టోరీ విలేకరులకు వివరించారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో కేసీఆర్ వినియోగించిన వాహన శ్రేణినే ఉపయోగించాలని అధికారులకు సూచించారు అన్నారు. చిన్న చిన్న మరమ్మతులు ఉంటే చేసి వాటినే వాడాలని అధికారులకు చెప్పాను అన్నారు. కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక అధికారి తన వద్దకు వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఒక షోరూం లో కొనుగోలు చేసిన 22 వాహనాల గురించి తనకు చెప్పారన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల తర్వాత ఈ విషయం తెలిసిందని… వాహనాల విషయంలోనే ఇంత గోప్యత ఉంటే.. ఇక మిగతా వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తమ నిర్వహిస్తున్న ప్రజావాణికి విశేషమైన స్పందన వస్తోందని.. కేటీఆర్, హరీష్ మాత్రం దానిని జీర్ణించుకోలేకపోతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. తనకి రేవంత్ రెడ్డి చెప్పిన కేసీఆర్ కార్ల కహానీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version