HomeతెలంగాణKCR Jagityal meeting: ఖమ్మంతో అనుభవం.. అందుకే కేసీఆర్ జగిత్యాల సభను పెట్టింది..

KCR Jagityal meeting: ఖమ్మంతో అనుభవం.. అందుకే కేసీఆర్ జగిత్యాల సభను పెట్టింది..

KCR Jagityal meeting: ఏకపక్ష విజయాలు రాజకీయ నాయకులను భూమి మీద నిలబడనివ్వవు. ఓ సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది. ఎందుకంటే ఏకపక్షంగా విజయాలు దక్కుతున్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరి మాటలూ వినరు . పైగా తామే సర్వాంతర్యములం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దీనివల్ల తాత్కాలికంగా ప్రయోజనం ఉంటుందేమో గాని.. దీర్ఘకాలంలో నష్టం తప్పదు. నష్టం జరిగిన తర్వాత చింతించి ఉపయోగం ఉండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలా ఏకపక్షంగా వ్యవహరించి సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇబ్బంది పడ్డవారే.

నేటి ఆధునిక కాల రాజకీయాలలో కేసీఆర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించి భంగపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కెసిఆర్ చాలా చేశారు. రాజకీయ పునరేకికరణ పేరుతో ప్రతిపక్షాన్ని లేకుండా చేసుకున్నారు. గిట్టని మీడియాను అడుగుదాక తొక్కారు. నచ్చని రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టారు.. కేసులు పెట్టి జైలుకు పంపించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని కొంతమంది రాజకీయ నాయకులను కేసులు పెట్టి వేధించారు. చివరికి తన దారికి తెచ్చుకున్నారు.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుతో చాలామంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడ్డారు. అందులో అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు.. వంటి వారున్నారు. వీరందరిని ఏకతాటిపైకి తీసుకురావడంలో నాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారు. ఖమ్మం కేంద్రంగా భారీ సభ నిర్వహించి.. రాహుల్ గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నాడు ఆ సభను కేసీఆర్ సీరియస్ గా తీసుకోలేదు. పైగా అప్పటి ఓ మంత్రి చెప్పిన మాటలు విని కెసిఆర్.. ఈ సభను.. కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీనివాస్ రెడ్డిని, నాగేశ్వరరావును లైట్ తీసుకున్నారు.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మొదలైంది. నాడు కెసిఆర్ కు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన మంత్రి తన ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే కాదు.. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయాలు సాధించింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సముచిత ప్రాధాన్యం లభించకపోవడం తో కొంత ఇబ్బంది పడుతున్నారు. నాడు కేసీఆర్ కాలంలో బిటీ బ్యాచ్ ఎలా అయితే హవా కొనసాగించిందో.. ఇప్పుడు వలస బ్యాచ్ కాంగ్రెస్ పార్టీలో అదే స్థాయిలో హవా కొనసాగిస్తోంది. అందువల్లే కీలకమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరుగుతున్నారు.

జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి వెళ్లిపోవడాన్ని అంత సింపుల్ గా చూడకూడదని.. దీని వెనుక పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా బలంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకరకంగా సోమవారం జగిత్యాల ప్రాంతంలో నిర్వహించే సభను జీవన్ రెడ్డి బల ప్రదర్శన లాగా చూడకూడదని.. కెసిఆర్ స్ట్రెంత్ లాగానే చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆల్రెడీ ఖమ్మం సభ ద్వారా తాను ఏం కోల్పోయారో కేసీఆర్ కు తెలుసు.. అందువల్లే ఆయన ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. జగిత్యాల సభ ద్వారా తెలంగాణకు ఒక బలమైన సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు.

కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేశారు. కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లారు. ఇది కౌంటర్ ఎటాక్ అవుతుందా.. కెసిఆర్ తీరు చూసి తట్టుకోలేక భయపడినట్టు అవుతుందా.. ఇలాంటి రకరకాల సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం.. రాజకీయాలలో స్వీయ తప్పిదాలు మాత్రమే జరుగుతాయి. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని బయటికి వెళ్లకుండా గనక చూసుకొని ఉంటే రేవంత్ రెడ్డికి ఇలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. అయితే జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఇక్కడితోనే ఆగిపోతుందా.. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పీఠాన్ని కదిలిస్తుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version