KCR And Jagan
KCR And Jagan: ప్రజాస్వామ్యంలో అధికారపక్షం.. ప్రతిపక్షం రెండూ ముఖ్యమే. పాలన వ్యవహారాలను చూసేది అధికార పక్షం.. పాలకుల లోపాలను ఎత్తి చూపుతూ.. ప్రజా సమస్యలపై పోరాడేది ప్రతిపక్షం. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే.. అధికార పక్షం అంత బాగా పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అధికార పక్షాన్ని పనిచేయించేది ప్రతిపక్షమే. అయితే.. కొన్నేళ్లుగా ప్రతిపక్ష పాత్ర ప్రశ్నార్థకమవుతోంది. ప్రజాతీర్పు అపహాస్యమవుతోంది. ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని.. విపక్ష ప్రజాప్రతినిధులు కూడా అధికార పక్షంలో చేరిపోతున్నారు. దీంతో బలహీనమైన ప్రతిపక్షం కారణంగా అధికార పక్షాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరూ ఆరు నెలల వ్యవధిలో అధికారం కోల్పోయారు. ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అయితే ఇద్దరు మిత్రులు ప్రతిపక్షంలో కూర్చోలేకపోతున్నారు.
అహం అడ్డొస్తోంది..
తెలంగాణలో కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పదేళ్లు.. విపక్షం ఉండొద్దు అన్నట్లు వ్యవహరించారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తనకు ఎదురు చెప్పేవారు.. తనను ప్రశ్నించేవారు ఉండకూడదన్న ఉద్దేశంతో ఇలా చేశారు. ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడం.. కానీ కేసీఆర్‌కు నచ్చనిది కూడా అదే. దీంతో పదేళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైనా.. నయానో భయానో విపక్ష నేతలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ప్రతిపక్షానికి పరిమితమైంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడిచినా… ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడానికి కేసీఆర్‌కు అహం అడ్డు వస్తోంది. ఇప్పటి వరకు రెండుసార్లు సభ నిర్వహించినా కేసీఆర్ మాత్రం విపక్ష స్థానంలో కూర్చోలేదు.
బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా ఎన్నిక..
కేసీఆర్ అసెంబ్లీకి రాడని తెలిసినా తెలంగాణలో 39 స్థానాలు గెలిచిన బీఆర్‌ఎస్ పార్టీ.. మాజీ ముఖ్యమంత్రినే తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన దూరంగానే ఉంటున్నారు. దీంతో అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావే ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి ముందు తలెత్తుకోలేక..
ప్రస్తుతం సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఇది కూడా మింగుడు పడడం లేదు. తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నారు. నాడు ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు రేవంత్‌రెడ్డిని ఇరికించారు. రేవంత్‌రెడ్డిని జైల్లో పెట్టారు. అనేక విధాలుగా వేధించారు. ఈ క్రమంలో ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ ముందు విపక్ష నేతగా కూర్చోవడానికి ఇష్టపడడం లేదు.
జగన్ ఘోర పరాభవం..
ఇక ఏపీలో మొన్నటి వరకు 151 సీట్లతో అధికారంలో ఉన్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం 11 సీట్లకే పరిమితమయ్యారు. వై నాట్ 175 నినాదంతో జగన్ సారథ్యంలో ఎన్నికల బరిలో దిగిన వైసీపీని ఆంధ్రా ఓటర్లు చిత్తుగా ఓడించారు. 11 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు పరిమితం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా.. వైసీపీని ప్రజలు ఆదరించకపోవడం జగన్‌కు మింగుడు పడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తోపాటు పలువురు సీనియర్ నేతలు జగన్ సర్కార్ అనేకరకాలుగా వేధించింది. అసెంబ్లీ సాక్షిగా జగన్ సర్కార్ విపక్ష నేత చంద్రబాబును తీవ్రంగా అవమానించింది. ఆయన సతీమణిపై వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఏడాదిలో జగన్ విపక్ష నేత చంద్రబాబును స్కిల్ స్కాం కేసులో జైల్లో పెట్టారు. వీటి ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
చంద్రబాబు ముందు కూర్చునే పరిస్థితి ఉందా..
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ సారథ్యంలో వైసీపీ విపక్షానికే పరిమితమైంది. నాడు 67 స్థానాల్లో గెలిచింది. విపక్షంగా కీలక పాత్ర పోషించింది. జగన్ కూడా అసెంబ్లీ అనుభవాలతో మంచి పరిణతి చెందారు. విపక్ష నేతగా కీలక పాత్ర పోషించారు. తర్వాత 2019 జరిగిన ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతో ఎన్నికల్లో పోటీచేసిన వైసీపీకి ఆంధ్రా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. దీంతో అధికారంలోకి వచ్చిన జగన్.. సంక్షేమం పేరుతో డబ్బులు పంచడం మినహా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అమరావతి రాజధానిని రద్దు చేసి మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. ఫలితంగా వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో చంద్రబాబు ముందు కూర్చొనే పరిస్థితి లేకుండా పోయింది.
అడ్డు పడుతున్న ఇగో..
2014 నుంచి 2019 వరకు విపక్షంలో కూర్చున్న జగన్.. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయారు. దీంతో అసెంబ్లీలో కూర్చోవడానికి ఆయనకు ఇగో అడ్డు పడుతోంది. దీంతో ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఆయన కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Kcr jagan why do not want to sit in the opposition in the assembly
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com