KCR: సార్వత్రిక ఎన్నికల వేళ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన పార్టీ కేడర్‌లో జోష్ నింపేందుకు, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు, పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుని పార్టీని బతికించుకునేందుకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రారు బుధవారం(ఏప్రిల్ 24) నుంచి బస్సు యాత్ర చేయబోతున్నారు. ఈమేరకు ఇప్పటికే బస్సు సిద్ధం చేసుకున్నారు. రూట్‌మ్యాప్ ఖరారైంది. మే 10వ తేదీ వరకు దాదాపు 14 లోక్‌సభ నియోజకవర్గాలు కవర్ చేసేలా యాత్ర చేయబోతున్నారు. అయితే యాత్రకు ముందు కేసీఆర్.. టీవీ9కు ఇంటర్వ్యూ.. కాదు కాదు.. టీవీ9 ద్వారా ఓ బహిరంగ సభనే పెట్టారు. 12 ఏళ్ల తర్వాత.. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఓడించిన తర్వాత ప్రజా సమస్యలు కేసీఆర్‌కు గుర్తొచ్చాయి. ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సున్నాకే పరిమితమైనే పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో క్యాడర్‌లో హైప్ తెచ్చేందుకు, ప్రజల్లో పునరాలోచన చేసేందుకు యాత్ర చేపడుతున్నాన్నారు. ఈ క్రమంలో తన అనుకూల ఛానెల్ టీవీ9లో దాదాపు 4 గంటలు మాట్లాడారు.
సుదీర్ఘ ఇంటర్వ్యూ…
రాజకీయ నేతల ఇంటర్వ్యూ అంటే.. అరగంట.. గంట.. మహా అయితే రెండు గంటలు ఉంటుంది. కానీ.. టీవీ9కు కేసీఆర్ ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూ ఏకంగా నాలుగు గంటలు సాగింది. బహిరంగ సభల్లో అరగంట, గంట మాట్లాడే కేసీఆర్.. ఈ ఇంటర్వ్యూలో ఏకంగా 3 గంటలకుపైగా మాట్లాడారు. ఇక బహిరంగ సభ అని ఎందుకు అన్నామంటే.. ఈ ఇంటర్వ్యూలో న్యూస్ రీడర్ అడిగిన ప్రశ్నకన్నా.. కేసీఆర్ ప్రసంగమే ఎక్కువగా ఉంది. ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా ప్రసంగిస్తూనే వెళ్లారు. ఒక్కో ప్రశ్నకు 10 నిమిషాలకుపైగా సమాధానం చెబుతూ వచ్చారు. దీంతో సుదీర్ఘంగా సాగింది.
ఏపీ రాజకీయాలపై..
ఇక ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ వైఫల్యాలతోపాటు కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ, విద్యుత్ ఒప్పందాలు, సమస్యలు, నేతల పార్టీ మార్పు ఇలా అనేక అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో ముగింపు సమయంలో ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారని అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందించారు. తన రాజకీయ గురువు అయిన చంద్రబాబు కంటే.. తన కొత్త మిత్రుడు అయిన జగన్ వైనే మొగ్గు చూపారు. ఈ సమయంలో చెప్పడం మంచిది కాదు అంటూనే.. ఎవరు గెలిచినా మాకు సంబంధం లేదని చెబుతూనే.. తమకు అందుతున్న సమాచారం మేరకు మళ్లీ జగనే గెలుస్తాడని ప్రకటించారు.
జగన్ అనుకూల వైఖరి..
కేసీఆర్ 2014 నుంచే జగన్ అనుకూల వైఖరి అవలంబిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ అధికార టీడీపీకన్నా జగన్‌తోనే టచ్‌లో ఉన్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఆర్థికంగా సాయం కూడా చేశారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ఇక జగన్ కూడా కాళేశ్వరం శకుస్థాపనకు రావడం, పలుమార్లు వివిధ అంశాలపై ప్రగతి భవన్‌కు వచ్చి వెళ్లడం.. కేసీఆర్ కూడా ఏపీకి వెళ్లి జగన్‌ను కలవడం వంటివి జరిగాయి. ప్రస్తుత ఎన్నికల షెడ్యూల్‌కు ముందుకు కూడా జగన్ హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలిసి వెళ్లారు. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై కేసీఆర్ తన మిత్రుడు అయిన జగన్‌కు అనుకూలంగా ఫలితాలను అంచనా వేశారని తెలుస్తోంది.