KCR In Hospital: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, గజ్వేల్ శాసనసభ్యులు కేసీఆర్ ఆస్పత్రి పాలయ్యారు. గురువారం రాత్రి కాలు జారి పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాదులోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. తుంటి ఎముక విరిగిన నేపథ్యంలో కెసిఆర్ కు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే శస్త్ర చికిత్స పై ఒక నిర్ణయానికి వస్తామని వైద్యులు చెబుతున్నారు. బుధవారం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గడిపారు. చింతమడక గ్రామస్తులతో ముచ్చటించారు. హరీష్ రావుతో చాలాసేపు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ సిబ్బందితో మాట్లాడారు. అయితే గురువారం రాత్రి బాత్ రూమ్ వెళ్లి వస్తుండగా కాలుజారి పడ్డారు. ఈ ప్రమాదంలో కెసిఆర్ కాలు తుంటి ఎముక విరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కెసిఆర్ ను హైదరాబాదులోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ఎం వి రావు ఆధ్వర్యంలో మొదట వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను అత్యవసర వైద్య విభాగానికి షిఫ్ట్ చేశారు.
ఎన్నికల ఫలితాల నాడే..
ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఆరోజు మధ్యాహ్నం 12 గంటల వరకే ఫలితాల ట్రెండ్ తెలియడంతో కెసిఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేశారు. తన కాన్వాయ్ కూడా వదిలేశారు. వ్యక్తిగత సిబ్బందిని కూడా రావద్దని ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఎంపీ సంతోష్ కుమార్ ను మాత్రమే తన వెంట రావాలని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయారు.. అక్కడ ఒకరోజు ఆయన ఏకాంతంగా గడిపారు.. ఎవరిని కూడా కలవడానికి ఇష్టపడలేదు. అనంతరం సోమ, మంగళవారాల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఫోన్లు చేశారు. అధైర్య పడొద్దు అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు.. అనంతరం బుధవారం చింతమడక గ్రామస్తులతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు.. వారితో గ్రామ అభివృద్ధి గురించి చర్చించారు. అండగా హరీష్ ఉంటాడని, ఆధర్య పడాల్సిన అవసరం లేదని వారికి హామీ ఇచ్చారు.
ఎలా జరిగింది
గురువారం ఉదయం కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్, సెక్రటేరియట్ ఖాళీ చేసిన నేపథ్యంలో తనకు విశాలమైన ఇల్లు కావాలని.. 25 కార్లు పట్టేంత పార్కింగ్ ప్లేస్ ఉండాలని ఎమ్మెల్యేలతో అన్నారు. అయితే అందులో ఒక ఎమ్మెల్యే మాత్రం తనకు అంత పెద్ద ఇల్లు, పార్కింగ్ ప్లేస్ కు అనువయిన స్థలం ఉందని.. అది ఇచ్చేస్తానని కేసిఆర్ తో అన్నారు. ఆ తర్వాత రాత్రి పొద్దుపోయే దాకా వారితో కెసిఆర్ చర్చలు జరిపారు. అనంతరం బాత్రూం వెళ్లి వస్తుండగా కాలుజారి కింద పడ్డారు. ఈ ప్రమాదాల్లో కేసీఆర్ కాలి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కెసిఆర్ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కెసిఆర్ కు చికిత్స అందిస్తున్న వార్డులో ఎవరినీ పైకి వెళ్ళనివ్వడం లేదు. కెసిఆర్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కెసిఆర్ కు అందిస్తున్న వైద్య చికిత్స పై ఆరా తీస్తున్నారు. కెసిఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.