కేసీఆర్ రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలంటూ తాము పదేపదే మొత్తుకున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని….తాజాగా ఆయా రైతాంగానికి 3 నెలల్లోగా పరిహారం అందించాల్సిందేనంటూ సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు తీర్పునిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మెట్టికాయలు వేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులను వినియోగించుకోవడం లోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి గులాబ్ తుఫాను బాధ తప్పినా…..గులాబీ చీడ మాత్రం ఇంకా మిగిలే ఉందని వ్యాఖ్యానించిన బండి సంజయ్ రాబోయే ఎన్నికల్లో గులాబీ చీడను వదిలించి బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమన్నారు. దళిత బంధు పథకం పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని, నిజంగా సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఎంతమందికి దళిత బంధు సాయం చేశారనే వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపద పెరిగిందని కోతలు కోస్తూ జీడీపీ అంశాన్ని లేవనెత్తుతున్న తండ్రీకొడుకులు ఏడేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఎందుకు దివాళా తీయించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తామే తయారు చేశామనే విధంగా అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతూ టీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మండి పడ్డ బండి సంజయ్ వ్యాక్సిన్ తయారీకి నిధులిచ్చి ప్రోత్సహించిన నేత ప్రధాని నరేంద్రమోదీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చి భారత్ బయోటెక్ ను సందర్శించే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇక్కడ వ్యాక్సిన్ తయారవుతోందనే సోయే లేదని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 33వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు (29.11.2021) సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. వేలాది మంది తరలి వచ్చిన ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఘోరక్ పూర్ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, కార్యదర్శి బొమ్మ జయశ్రీతోపాటు సిద్దిపేట జిల్లా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన జి.శివారెడ్డి, అందెల శ్రీరాం ప్రజా సంగ్రామ యాత్రపై ప్రత్యేకంగా రూపొందించిన పాటల సీడీని బండి సంజయ్, ఘోరక్ పూర్ ఎంపీ రవి కిషన్ ఆవిష్కరించారు.