Double Ismart Song: కేసీఆర్‌ను డబుల్‌ ఇస్మార్ట్‌లో వాడేసిన పూరి.. పాటలో గులాబీ బాస్ ఫేమస్ డైలాగ్‌.. భగ్గుమంటున్న బీఆర్‌ఎస్‌!

రామ్‌ పోతినేని డబుల్‌ ఇస్మార్ట్‌లో హీరోగా నటిస్తున్నారు. ఆయనపై తీసిన ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాయిస్‌ను ఉపయోగించారు. ఆయన కోవిడ్‌ సమయంలో ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు వాడిన ‘‘ఏం జేద్దామంటవ్‌’’ అనే డైలాగ్‌ను ఉన్నది ఉన్నట్లుగా కేసీఆర్‌ వాయిస్‌తోనే వాడేశారు. పాట మధ్యలో రెండుసార్లు ఈ వాయిస్‌ వినిపిస్తుంది.

Written By: Raj Shekar, Updated On : July 17, 2024 4:50 pm

Double Ismart Song

Follow us on

Double Ismart Song: తెలంగాణలో అధికారం కోల్పోయాక కేసీఆర్‌ను ఇష్టానుసారం వాడేసుకుంటున్నారు. గతేడాది వచ్చిన గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మడతపెట్టి డైలాగ్‌ తరహలో పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న డబుల ఇస్మార్ట్‌లో కేసీఆర్‌ ఫేమస్‌ డైలాగ్‌ను వాడేసుకున్నాడు. ఈ సినిమాను పూరిజగన్నాథ్‌ చార్మితో కలిసి పూరి కనెక్ట్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పాటను విడుదల చేసింది మూవీ టీం. ‘‘మార్‌ ముంత.. చోడ్‌ చింత’’ అంటూ సాగే పాట ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.

పాట మధ్యలో కేసీఆర్‌ వాయిస్‌..
రామ్‌ పోతినేని డబుల్‌ ఇస్మార్ట్‌లో హీరోగా నటిస్తున్నారు. ఆయనపై తీసిన ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాయిస్‌ను ఉపయోగించారు. ఆయన కోవిడ్‌ సమయంలో ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు వాడిన ‘‘ఏం జేద్దామంటవ్‌’’ అనే డైలాగ్‌ను ఉన్నది ఉన్నట్లుగా కేసీఆర్‌ వాయిస్‌తోనే వాడేశారు. పాట మధ్యలో రెండుసార్లు ఈ వాయిస్‌ వినిపిస్తుంది. కేసీఆర్‌ వాయిస్‌ను సినిమా పాటలో వాడడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్‌ అభిమానులు పూరి జగన్నాథ్‌పై మండిపడుతున్నారు.

కేసీఆర్‌ ఊతపదం..
’డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాలోని ’మార్‌ ముంత చోడ్‌ చింత..’ అనే ’కల్లు కంపౌండ్‌’ పాటలో హీరో, హీరోయిన్‌ కల్లు బాటిళ్లు పట్టుకొని చిందేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్‌ పాపులర్‌ ఊతపదం ’ఏం జేద్దామంటవ్‌ మరీ..’ పదాల్ని ఆయన వాయిస్‌నే ఉపయోగించారు.

లిక్కర్‌కు బ్రాండ్‌గా..
తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకే మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాగనంతగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సాగాయి. పండుగైనా పబ్బమైనా, విషాదమైనా మద్యం తాగాలి అన్నట్లుగా కేసీఆర్‌.. మద్యం అమ్మకాలను ప్రోత్సహించారు. ఖజానాకు డబ్బుల కోసం తాగినోళ్లకు తాగినంత మద్యం అమ్మించారు. ఇందుకోసం ఎక్సైజ్‌ అధికారులకు టార్గెట్‌ పెట్టారు. బెల్ట్‌ షాపులను ప్రోత్సహించారు. దీంతో కేసీఆర్‌ లిక్కర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారు. తాజాగా డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా పాటలో కూడా దర్శకుడు పూరీ… కేసీఆర్‌ అంటే తాగుడు.. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా పాట మధ్యలో ఆయన టోన్‌ ఉపయోగించారు. ఇదే ఇప్పుడు కేసీఆర్‌ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా చూపేలా పాట ఉందని మండిపడుతున్నారు. ఈ పాటలో కేసీఆర్‌ హుక్‌ లైన్‌ వాడడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కల్లు కాంపౌండ్‌ పాటకు..
దర్శకుడిగా తన అభిరుచి మేరకు పాటను తెరకెక్కిచే స్వేచ్ఛ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఉంది. అయితే కల్లు పంపౌండ్‌ పాటలో ఒక రాష్ట్రానికి పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి టోన్‌ను ఉపయోగించడం ఆయనను అవమానించడమే అని కేసీఆర్‌ అభిమానులు, బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడుతున్నారు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియా వేదికగా తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పూరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రచయిత.. సింగర్‌పైనా..
ఇక ఈ పాట రచయిత కాసర్ల శ్యామ్, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌పైనా సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నాయకులు, కేసీఆర్‌ అభిమానులు. ఇద్దరూ తెలంగాణ ప్రాంతం వారై ఉండి అలాంటి కేసీఆర్‌ హుక్‌లను ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సొంత ప్రాంతాన్ని కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాటలోని కేసీఆర్‌ హుక్‌లైన్స్‌ తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే.. డబుల్‌ ఇస్మార్ట్‌ వివాదంలో చిక్కుకున్నట్లయింది.