Kavitha Political Comeback: రాజకీయాలలో స్వయం ప్రకాశకాలుగా వెలిగే వారికే విలువ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికే అధికారం దక్కుతుంది. కొన్ని సందర్భాలలో వారు అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోయినప్పటికీ.. అంతిమ కాలంలో వారు కోరుకున్న వారిని నెరవేరుతుంటాయి. అయితే తెలంగాణ రాజకీయాలలో స్వయం ప్రకాశితంగా ప్రారంభంలో వెలగలేకపోయినప్పటికీ.. ఆ తదుపరి కెసిఆర్ తన రాజకీయాల లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యర్థులను అడుగుదాక తొక్కారు. ఆ తర్వాత ఆయన స్వయం ప్రకాశంగా వెలగడం మొదలుపెట్టారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత కెసిఆర్ నీడలోనే ఎదిగినప్పటికీ.. ఆ తదుపరి వారి వారి రాజకీయ క్షేత్రాలలో విజయవంతమయ్యారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ఎస్ ఎదురుదాడి
కేటీఆర్, హరీష్ రావుకు పార్టీలో ఎదురనేది లేకపోయినప్పటికీ.. కల్వకుంట్ల కవితకు 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో అనూహ్యంగా స్పీడ్ బ్రేక్ పడింది. అది ఆమె రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసింది. కెసిఆర్ ఆమెకు శాసనమండలి స్థానం ఇచ్చినప్పటికీ.. కవిత ప్రస్థానం ఒకరకంగా పార్టీలో ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది. దీనికి తోడు ఢిల్లీలో చోటు చేసుకున్న లిక్కర్ కుంభకోణం ఆమె రాజకీయ జీవితాన్ని మరింత ప్రభావితం చేశాయి. ఆ కేసు నుంచి బెయిల్ ద్వారా ఆమె బయటికి వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఆ ఇబ్బందులు ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన స్వరాన్ని వినిపించడం ఒకరకంగా తన తండ్రికి కోపం తెప్పించినట్టయింది. పార్టీలో నిరసన స్వరాన్ని గులాబీ అధినేత ఏమాత్రం సహించలేరు. అవసరమైతే తనతో పాటు వచ్చిన వాళ్లను.. తనతో పాటు నడిచిన వాళ్లను ఆయన దూరం చేసుకుంటారు. మొహమాటం లేకుండా బయటికి గెంటేస్తారు. ఆలే నరేంద్ర నుంచి మొదలుపెడితే ఈటెల రాజేందర్ వరకు ఈ ఉదంతాలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే దీనికి కల్వకుంట్ల కవిత మినహాయింపు కాదని అనుకుంటున్నప్పటికీ.. ఇంతవరకు ఆమె పార్టీ నుంచి బయటికి వచ్చిన దాఖలాలు లేవు. కాకపోతే గులాబీ అధినేత ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తన సోదరుడితో రాజకీయంగా విభేదాలు ఉన్నాయని కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పారు. దీంతో ఆమె రాజకీయ క్షేత్రం సొంతంగానే ఉండబోతుందని సంకేతాలు కూడా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే తన సంస్థ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Also Read: సీఎం రమేశ్‌ను కేటీఆర్ ఎందుకు టార్గెట్ చేశారు?
హైదరాబాద్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో కల్వకుంట కవిత ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సాధారణంగా కల్వకుంట్ల కవితకు గులాబీ కరపత్రిక విపరీతమైన కవరేజ్ ఇస్తుంది. కానీ ఈసారి ఎందుకనో ఆమెను దూరం పెట్టింది. చివరికి ఆమె ఫోటో లేకుండా.. ఆమె పేరు ప్రస్తావన లేకుండా వార్తలను ప్రచురించే స్థాయికి నమస్తే తెలంగాణ ఎదిగింది. సరే దీని వెనుక ఎవరున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నత విద్యావంతురాలు, వాగ్ధాటి అధికంగా ఉన్న కల్వకుంట్ల కవిత తనకంటూ ఒక రాజకీయ క్షేత్రాన్ని నిర్మించుకుంటున్నారు. దీనివల్ల ఆమె విజయవంతం అవుతారా? విఫలమవుతారా? అనే ప్రశ్నలు పక్కన పెడితే ఆమె మాత్రం ప్రయోగం చేస్తున్నారు. సాధారణంగా రాజకీయాలలో మేల్ డామినేషన్ అధికం. ఇది కల్వకుంట్ల కవితకు కూడా అనుభవంలోకి వచ్చింది. తన రాజకీయ వారసుడిగా గులాబీ దళపతి కేటీఆర్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఈ పరిణామం కవితకు కాస్త బాధను కలిగించినట్టైంది. అందువల్లే ఆమె ఈ ప్రయాణాన్ని ఎంచుకుంది. ప్రస్తుతానికి జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీడర్ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ముగింపు రోజు కల్వకుంట కవిత ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగిస్తారని జాగృతి కార్యకర్తలు చెబుతున్నారు.