Kavitha New Political Party: గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రయాణాన్ని మరింత వేగంగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే బలమైన అడుగులు వేస్తున్నారు. అంతేకాదు, రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.
మొన్నటి వరకు తెలంగాణలో సమస్యలను గుర్తించడానికి.. తెలంగాణ ప్రజల ఇబ్బందులను అధ్యయనం చేయడానికి ఆమె యాత్ర చేశారు. జాగృతి ఆధ్వర్యంలో కొంతమంది కీలక నాయకులతో ఆమె తెలంగాణలో ఉన్న జిల్లాలలో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడం మాత్రమే కాదు, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఆమె బయట పెట్టారు. భూకుంభ కోణాలు, అక్రమ వ్యవహారాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను మొహమాటం లేకుండా ఆమె బయట పెట్టారు. హరీష్ రావు నుంచి మొదలు పెడితే కేటీఆర్ వరకు ఎవరినీ ఆమె వదిలిపెట్టలేదు. స్వయంగా సొంత తండ్రిపై కూడా ఆమె విమర్శలు చేశారు.
కల్వకుంట్ల కవిత కేవలం ఈ విమర్శలను ఊక దంపుడు ఉపన్యాసానికి పరిమితం చేయడం లేదు. పకడ్బందీ ఆధారాలతో బయట పెడుతోంది. కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలకు గులాబీ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నప్పటికీ.. ప్రజల్లోకి కవిత చేస్తున్న వ్యాఖ్యలే బలంగా వెళుతున్నాయి. అయితే ప్రజల నుంచి వస్తున్న మైలేజ్ ను ఇక్కడితోనే ఆపాలి అని కవిత అనుకోవడం లేదు. ఆమె ఏకంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా సంకేతాలు ఇస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుల సమాచారం ప్రకారం.. జాగృతిలోని కీలక నేతలు చెప్పిన వివరాల ప్రకారం కల్వకుంట్ల కవిత త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. తన మానస పుత్రిక జాగృతి సంస్థను పార్టీ పేరులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ గుర్తు, విధి విధానాలపై ఆమె ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. తను స్థాపించబోయే పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును కవిత ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
తనకు సెంటిమెంట్ గా ఉన్న జాగృతి పేరును పార్టీలో పెట్టినట్టు తెలుస్తోంది. ఉగాది నాటికి పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి.. విధివిధానాలు వెల్లడించి.. క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ పోతారని తెలుస్తోంది. దీనికి తోడు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పురపాలక ఎన్నికల్లో జాగృతి ఆధ్వర్యంలో అభ్యర్థులు పోటీ చేస్తారని ఇప్పటికే కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
కల్వకుంట్ల కవితకు గతంలో సింగరేణి లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతోపాటు తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలలో ఆమెకు అభిమానులు ఉన్నారు. గడచిన పది సంవత్సరాలు కాలంలో ఆమె క్రియాశీలక రాజకీయాలలో అంతగా ప్రభావం చూపించలేకపోయారు.
గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకు ఎదురైన అవమానాలను చెప్పుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో సొంత కుటుంబాల నుంచి తాను పడిన ఇబ్బందులను వెల్లడిస్తున్నారు. కవిత చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు, గులాబీ పార్టీలో ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కవిత ఏర్పాటు చేస్తే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే, గులాబీ పార్టీకే ఎక్కువ నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.