Kavitha new party launch date: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరు నెలలు జైలుకు వెళ్లొచ్చిన జాగృతి అధ్యక్షురాలు.. కల్వకుంట్ల కవితను ఆరు నెలల క్రితం బీఆర్‌ఎస్ బహిష్కరించింది. పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేయడం, అంతర్గత కుమ్ములాటల కారణంగా కవితను అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. త్వరలో కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని కవిత తెలిపారు.
అదే ముహూర్తం ఎందుకు?
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ కీలక ప్రకటన చేయడం సంతోషంగా ఉందని కవిత నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ఈ శుభదినాన్ని ఎంచుకోవడం వల్ల పార్టీకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఆశీస్సులు లభిస్తాయని ఆమె భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ కూడా ఏప్రిల్ 22న ఆవిర్భవించింది. అందుకే కవిత కూడా ఏప్రిల్ 20 తర్వాతనే ముహూర్తం పెట్టుకున్నారు.
పార్టీ లక్ష్యం, అజెండా
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై పోరాటం, సర్వోదయ తెలంగాణ సాధనే ఈ కొత్త పార్టీ ముఖ్య ఉద్దేశమని కవిత స్పష్టం చేశారు. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాలను అధ్యయనం చేసి, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, మహిళా భద్రత వంటి అంశాలపై ఉద్యమిస్తుందన్నారు. అందరి అభివృద్ధి, సమాన అవకాశాలు కల్పించే పాలన లక్ష్యమని తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ప్రయాణం చేస్తామన్నారు.
Also Read: రేవంత్ తీరు.. కాంగ్రెస్ కు కత్తిమీద సాము..
సభ వివరాలు ఇవీ..
ఏప్రిల్ 25 శుక్రవారం ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా, మునీరాబాద్‌లో జాగృతి సభ ఉంటుంది. ఈ సభకు సుమారు లక్ష మందిని సమీకరించాలని కవిత లక్ష్యంగా పెట్టుకున్నారు అన్ని వర్గాల ప్రజలు, యువకులు, రైతులు, మహిళలు భారీ సంఖ్యలో తరలిరావాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఈమేరకు తన అనుచరులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తారు. పార్టీ కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
రాజకీయ ప్రాధాన్యం
కవిత కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో మూడు ముఖ్య పార్టీల (బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ) మధ్య సరికొత్త సమీకరణాలు ఏర్పడనున్నాయి. ఇక మునీరాబాద్ సభా వేదికగా ఎంచుకోవడం వెనుక జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఆకర్షించే ఉద్దేశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత గతంలో ప్రకటించినట్లు పార్టీ పేరులో ·‘తెలంగాణ‘· ఉంటుందని తెలుస్తోంది. కవిత వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.
కవిత కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు మారనున్నాయి. సర్వోదయ భావజాలంతో, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును మలచడమే ఈ పార్టీ లక్ష్యం. ఏప్రిల్ 25న మునీరాబాద్ సభతో తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవనుంది.