https://oktelugu.com/

MLC Kavitha: కవితకు డెంగీ.. తిహార్‌ జైల్లో అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స.. కోర్టు అనుమతిస్తేనే అడ్మిట్‌!

కవితకు డెంగీ పాజిటివ్‌గా వస్తే ఆమెను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్‌దయాళ్‌ ఆస్పత్రితోపాటు, ఎయిమ్స్‌ లేదా రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స అందించే అవకాశం ఉంది. అయితే ఇందు కోసం జైలు అధికారులు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కవిత ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 17, 2024 10:54 am
    MLC Kavitha

    MLC Kavitha

    Follow us on

    MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయి తిహార్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న తెలంగాణ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమత్రి కేసీఆర్‌ కూతురు కవిత అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం ఆమెను జైలు అధికారులు ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేయించారు. తీవ్రమైన జ్వరంతోపాటు గైనిక్‌కు సంబంధించిన సమస్యలతో కవిత బాధపడుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు వెల్లడించారు.

    రక్త నమూనాల సేకరణ.,.
    చికిత్సలో భాగంగా రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు జ్వర నిర్ధారణ కోసం బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించారు. కవిత వైద్యులకు చెప్పిన లక్షణాల ప్రకారం ఆమె డెంగీతో బాధపడుతున్నట్లు వైద్యులు భావిస్తున్నారు. కవిత చెప్పిన వివరాలు డెంగీ లక్షణాలను పోలి ఉన్నట్లు వైద్యులు అంచనా వేశారు. అయితే రక్త పరీక్షల అనంతరం వచ్చిన రిపోర్టు ఆధారంగా తదుపరి చికిత్స అందించే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం తిహార్‌ జైలు అధికారులు కవితను తిరిగి జైలుకు తీసుకెళ్లారు.

    కోర్టు అనుమతితోనే అడ్మిట్‌..
    ఇక కవితకు డెంగీ పాజిటివ్‌గా వస్తే ఆమెను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్‌దయాళ్‌ ఆస్పత్రితోపాటు, ఎయిమ్స్‌ లేదా రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స అందించే అవకాశం ఉంది. అయితే ఇందు కోసం జైలు అధికారులు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కవిత ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

    నాలుగు నెలలుగా జైల్లో..
    ఇదిలా ఉంటే మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ అయిన కవిత నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్నారు. మార్చి 15న హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కవితను అరెస్ట్‌ చేశారు. రాత్రి ఢిల్లీకి తీసుకెళ్లారు. 16వ తేదీని ప్రత్యేక కోర్టులో హాజరు పర్చడంతో న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ 11న కవితను సీబీఐ కూడా అరెస్టు చేసింది. రెండు రోజులు కస్టడీకి తీసుకుని విచారణ చేసింది. దీంతో కవిత ప్రస్తుతం ఈడీతోపాటు సీబీఐ కేసుల్లో కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.

    బెయిల్‌ ప్రయత్నాలు విఫలం…
    ఇదిలా ఉండగా కవిత బెయిల్‌ కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. మొదట కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్‌ కోరారు. తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ కోసం అప్పీల్‌ చేశారు. తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రతీసారి దర్యాప్తు సంస్థల వాదనతో కోర్టులు ఏకీభవించి కవిత బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చాయి. దీంతో ఇక సుప్రీం కోర్టు తలుపు తట్టే యోచనలో ఉన్నారు కవిత తరఫు లాయర్లు. దర్యాప్తు సంస్థలు చార్జిషీట్‌ దాఖలు చేసినందున బెయిల్‌ ఇవ్వాలని ఇప్పటికే ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

    డిఫాల్టర్‌ బెయిల్‌ కోసం…
    దర్యాప్తు సంస్థలు చార్జిషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో కవిత తనకు డిఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరారు. విచారణ జరిపిన కోర్టు.. కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై పరిశీలించింది. సీబీఐ కేసులో డిఫాల్ట్‌ బెయిల్‌ ఇచ్చే పిటిషన్‌ విచారణను కోరుట జూలై 22కు వాయిదా వేసింది. జూలై 18 వరకూ జుడీషియల్‌ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. దీనికి కారణం కవితపై దాఖలు చేసిన చార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. దీనికి కౌంటర్‌ గా ఎలాంటి తప్పులు లేవని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కుంభకోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మాత్రమే కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. ఈ నేపథ్యంలో డీఫాల్టర్‌ బెయిల్, చార్జిషీట్‌ పరిగణలోకి తీసుకునే విషయంలో జూలై 22న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. దీనిపై స్పష్టమైన తీర్పు వస్తుందా లేదా అని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.