Kavitha BRS Party: మొన్ననేమో పార్టీ పరిస్థితి పై దాడికి లేఖల రూపంలో రాశారు. నిన్ననేమో డాడీ చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇవాళేమో బీసీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదని స్పష్టం చేశారు. ఏనాటికైనా నా లైన్లోకి రావాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు మరొకరు చేసి ఉంటే పెద్దగా చర్చ ఉండేది కాదు. చర్చించాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఈ వ్యాఖ్యలు చేసింది గులాబీ బాస్ కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. ఒకవేళ పార్టీలో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేసి ఉంటే కచ్చితంగా కేసీఆర్ తన్ని తరిమేసేవాడు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ రాములు నాయక్ ను కెసిఆర్ అవతలికి పంపించాడు. పార్టీకి మేమే ఓనర్లమని అంటే ఈటల రాజేందర్ ను అవమానకరంగా సాగనంపాడు.. ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు చేసింది తన కూతురు కాబట్టి.. కెసిఆర్ సైలెంట్ గా ఉంటున్నాడు.. మరోవైపు కేసీఆర్ కుమార్తె ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి నుంచి శాసనమండలి సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
Also Read: బాలయ్య-అనసూయ ‘స్క్విడ్ గేమ్’ ఆడితే..!
పార్టీ లైనుకు వ్యతిరేకంగా.. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్నాయి. ఒకవైపు తన తండ్రి నాయకత్వంలో పనిచేస్తున్నానని చెబుతున్న ఆమె.. తన సోదరుడు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు.. అంతేకాదు రేవంత్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ప్రకటించిన ఆర్డినెన్స్ విషయంలో.. గులాబీ పార్టీ తన లైన్లోనే రావాలని కవిత అంటున్నారు.. కవిత మొహమాటం లేకుండా మాట్లాడుతున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఆమెకు దూరంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమెపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని సృష్టించాయి. ఆమెపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పట్ల జాగృతి కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. తీన్మార్ మల్లన్న కార్యాలయం పై దాడి చేశారు. కవితకు భారత రాష్ట్ర సమితి నుంచి ఎటువంటి సంఘీభావం రాకపోవడం విశేషం.. కేవలం మధుసూదనాచారి మాత్రమే ఆమెకు అండగా ఉన్నారు. ఆమె వైపు సపోర్ట్ గా మాట్లాడారు..
మరోవైపు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష స్థానం నుంచి కవితను మంగళవారం తొలగించారు. ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ ను కేటీఆర్ నియమించారు. ఈ పరిణామం కవిత వర్గీయులలో ఆందోళన కలిగించింది. అంతేకాదు ఆమెను బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు స్థానం నుంచి తొలగించడం పట్ల జాగృతి కార్యకర్తలు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిణామానికి కేటీఆర్ కారణమంటూ ఆయనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. మరోవైపు ఈ విషయంపై కవిత గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తనపై తీన్మార్ మల్లన్న ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే పార్టీ అండ లేదన్నారు. ఇలాంటి సందర్భాల్లో పార్టీ నాయకులు మాట్లాడకపోవడం దారుణమని కవిత పేర్కొన్నారు. ఇదంతా కూడా వారి విజ్ఞతకు వదిలేస్తున్నట్టు కవిత ప్రకటించారు..
ఈశ్వర్ నియామకాన్ని ఆమె స్వాగతించారు.. సింగరేణి కార్మికుడిగా పని చేసిన అనుభవం ఈశ్వర్ కు ఉందని.. ఆయనకు సింగరేణి సమస్యలపై అవగాహన ఉందని.. జగిత్యాల జిల్లాకు ఆయన పెద్దన్న అని కవిత వ్యాఖ్యానించారు.. అంతేకాదు తీన్మార్ మల్లన్న పేరు ప్రస్తావిస్తూ ఆయనను జనాభా లెక్కల నుంచి తీసివేసామని.. ఎప్పటికైనా భారత రాష్ట్ర సమితి నాయకులు తన దారికి రావాలని కవిత ఓపెన్ గానే చెప్పేశారు.. మొత్తంగా చూస్తుంటే పార్టీ నుంచి కవిత దూరం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ నుంచి నుంచి వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి వెళ్తారు. కానీ కవిత మాత్రం పూర్తి విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.