Kavitha New Party: భారత రాష్ట్ర సమితి బహిష్కృత నేత.. జాగృతి అధినాయకురాలు కలవకుండా కవిత ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. బతుకమ్మ సంబరాలలో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో ఆమె తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. రోజుకో తీరుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నారు.
లండన్ లో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత.. ఒకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే తాను పార్టీ పెడతానని స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు విషయంలో తనకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయని కవిత వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి పార్టీ ఏర్పాటు విషయంలో ఆమె ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది నేతలతో ఆమె సమాలోచనలు జరిపారు. ఇటీవల కాలంలో కూడా తన నివాసంలో ముఖ్య కార్యకర్తలతో ఆమె వరుసగా సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ సమావేశాలలో ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు.
భారత రాష్ట్ర సమితిపై కూడా కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 20 సంవత్సరాల పాటు తాను భారత రాష్ట్ర సమితిలో ఉన్నానని.. పార్టీ ఎదుగుదల కోసం తన కృషి చేశానని.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కవిత వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ తనకు సరిపడదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని.. రాజకీయ కార్య క్షేత్రాన్ని ప్రజలు కోరుకున్న విధంగా ఏర్పాటు చేస్తానని కవిత పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ పెడతారని మొన్నటి దాకా ప్రచారం జరిగిన నేపథ్యంలో.. కవితే నేరుగా స్పష్టం చేయడంతో.. ఇప్పట్లో ఆమె పార్టీ పెట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సంచలన వ్యాఖ్యలతో మరోసారి కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారారు.