Kavitha: కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి సస్పెన్షన్, ఆమె ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఆమె తన బంధువులు టి.హరీశ్‌రావు, జోగినపల్లి సంతోష్ కుమార్‌లపై చేసిన తీవ్ర ఆరోపణలు బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలను బయటపెట్టాయి. అయితే, కవిత ఆరోపణలుపైకి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఆమె అసలు అసంతృప్తి తన సోదరుడు కేటీ.రామారావు (కేటీఆర్), తండ్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: అక్షరాలా 10 వేల కోట్లు.. తెలుగోడి సత్తాచాటనున్న మహేష్, రాజమౌళి!
కవిత తన బంధువులు హరీశ్ రావు, సంతోష్‌కుమార్‌పై కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు చేస్తూ, వారు తన తండ్రి కేసీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీశారని, కుటుంబాన్ని విడగొట్టే కుట్రలు చేశారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల వెనుక ఆమె అసలు అసంతృప్తి బీఆర్‌ఎస్‌లో తనకు ఆశించిన ప్రాధాన్యం లభించకపోవడం, ముఖ్యంగా కేటీఆర్ నాయకత్వంలో తన పాత్రను పరిమితం చేయడంపై ఉందని స్పష్టమవుతోంది. కవిత హరీశ్ రావును అవినీతి అనకొండలుగా వర్ణిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు, కేసీఆర్‌పై సీబీఐ విచారణకు కారణమైనవారిలో ఒకరిగా ఆరోపించారు. హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై, కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒకే విమానంలో వీరిద్దరూ ప్రయాణించడం, హరీశ్ రావుపై అవినీతి ఆరోపణలు ఆగిపోవడం ఆమె ఆరోపణలకు ఆధారంగా చెప్పారు.
హరీశ్ బుజంపై తుపాకీ పెట్టి కేటీఆర్ టార్గెట్..
కవిత ఆరోపణలు హరీశ్ రావును లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఆమె అసలు అసంతృప్తి కేటీఆర్‌పైనే. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తనను సంప్రదించకపోవడం, తన లీకైన లేఖపై 103 రోజులు నిశ్శబ్దంగా ఉండటం ఆమెను కలచివేసింది. కేటీఆర్ నాయకత్వంలో ఆమెకు తగిన ప్రాధాన్యం లభించలేదని, కేసీఆర్ వారసత్వంలో తనకు సమాన వాటా ఇవ్వకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. కవిత తన సస్పెన్షన్‌ను కుటుంబ విభజనకు మొదటి అడుగుగా చిత్రీకరించింది, హరీశ్‌రావు, సంతోష్ కుమార్‌లు కేసీఆర్, కేటీఆర్‌లను వేరు చేసే కుట్రలో భాగమని ఆరోపించింది. అయితే, రాజకీయ విశ్లేషకులు కవిత అసలు ఆగ్రహం కేసీఆర్, కేటీఆర్‌లు తనను పార్టీలో పక్కనపెట్టడంపైనే అని భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్‌లో కవిత స్థానం..
కవిత తెలంగాణ ఉద్యమంలో, బీఆర్‌ఎస్‌లో ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ, పార్టీలో ఆమెకు ఆశించిన గుర్తింపు లభించలేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, 2006 నుంచి ఆమె మహిళలు, యువతను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ, కేటీఆర్, హరీశ్ రావులతో పోలిస్తే ఆమె పాత్ర పరిమితమైంది. ఇక కేసీఆర్ వారసుడిగా కేటీఆర్‌ను స్పష్టంగా ప్రొజెక్ట్ చేయడం, హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించడం కవిత అసంతృప్తికి కారణమైంది. 2025 జులైలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమెను తొలగించడం ఆమె అవమానాన్ని మరింత పెంచింది. 2025 మేలో కవిత కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ లీక్ కావడం ఆమె తిరుగుబాటుకు ఆరంభం. ఈ లేఖలో ఆమె పార్టీలో ‘‘దెయ్యాలు’’ ఉన్నాయని, తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ లేఖ లీక్ కావడంతో ఆమె ఒంటరితనం మరింత తీవ్రమైంది.
సస్పెన్షన్, రాజీనామా..
సెప్టెంబర్ 2న కవితను బీఆర్‌ఎస్ సస్పెండ్ చేసింది. దీనిని కేసీఆర్ ఆమోదించారు. ఆమె తదుపరి రోజు ఎమ్మెల్సీ పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాలు ఆమోదం పొందాయా అనేది స్పష్టత లేదు. కవిత బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చడం లేదా ఇతర పార్టీలతో చేరడం వంటి ఎంపికలు ఆమె ముందున్నాయి, కానీ ఈ రెండూ సవాళ్లతో కూడుకున్నవి. కవిత తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే అవకాశం ఉందని కొందరు ఊహిస్తున్నారు. అయితే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ వంటి బలమైన పార్టీల మధ్య కొత్త పార్టీ స్థిరపడటం కష్టసాధ్యం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్. షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ విఫలమైన ఉదాహరణ ఈ సవాలును సూచిస్తుంది. కవిత గతంలో కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ, రేవంత్ రెడ్డి వ్యతిరేకతతో అది సాధ్యపడలేదని వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరిక కూడా అసంభవం, ఎందుకంటే ఆమె ఢిల్లీ మద్యం కేసులో బీజేపీ పాత్ర ఉందని భావిస్తోంది, అలాగే బీజేపీలో ఆమె ప్రత్యర్థి ధర్మపురి అరవింద్ బలమైన స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కవిత తాత్కాలికంగా తెలంగాణ జాగృతి ద్వారా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించి, రాజకీయంగా శక్తిని సమీకరించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆలస్యం ఆమె రాజకీయ ఊపును తగ్గించవచ్చు.
బీఆర్‌ఎస్‌పై ప్రభావం..
కవిత బీఆర్‌ఎస్ నుంచి బయటకు రావడం పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసినప్పటికీ, దాని రాజకీయ బలానికి పెద్ద నష్టం జరగకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత బహిరంగ ఆరోపణలు, కుటుంబ విభేదాలను బయటపెట్టడం బీఆర్‌ఎస్ ప్రతిష్ఠను దిగజార్చాయి. కేసీఆర్, కేటీఆర్‌లపై ఆమె చేసిన పరోక్ష విమర్శలు, కుటుంబ రహస్యాలు బయటపడతాయేమోనన్న ఆందోళన నెలకొంది. కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్‌ఎస్‌లో మహిళా ఎమ్మెల్సీలు బహిరంగంగా విమర్శించడం, పార్టీలో మహిళలకు గళం వినిపించే అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు.