Kaushik Reddy Vs Arikepudi Gandhi: కౌశిక్ రెడ్డి vs అరికెపూడి గాంధీ.. అసలేంటి రచ్చ.. వీరిద్దరి మధ్య వచ్చిన వివాదమేంటి?*

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది కావొస్తున్నా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్‌ వెనక్కి తగ్గడం లేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి తగ్గేదే లేదు అంటున్నారు కాంగ్రెస్‌ నాయకులు. నిన్నటి వరకు మాటలకు పరిమితమైన యుద్ధం.. ఇప్పుడు చేతల వరకు వెళ్లింది. ఏపీ తరహాలో విపక్ష ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యే(పార్టీ మారిన)దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Written By: Raj Shekar, Updated On : September 12, 2024 1:38 pm

Kaushik Reddy Vs Arikepudi Gandhi

Follow us on

Kaushik Reddy Vs Arikepudi Gandhi: తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ నేతల మధ్య దాదాపు ఏడాదిగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌పై మాటల దాడి మరింత పెంచింది. అయితే ఓటమి తర్వాత వెనక్కి తగ్గుతుందని భావించిన బీఆర్‌ఎస్‌ కూడా దూకుడు తగ్గించడం లేదు. దీంతో ఏడాదిగా రాజకీయాలు నువ్వా నేనా అన్నట్లుగానే సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీరు కొన్నిసార్లు పార్టీకి లాభం కలిగిస్తుండగా కొన్నిసార్లు పరువు తీస్తోంది. గతంలో గవర్నర్‌పై, మహిళలపై అనుచిత వాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిపై కోర్టు, మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో క్షమాపణ చెప్పారు. తాజాగా ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ చీర కట్టుకుని గాజులు వేసుకుని తిరగాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మహిళా విభాగం మండిపడింది. చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించింది.

తాజాగా పాడి కౌశిక్‌ వర్సెస్‌ అరికపూడి గాంధీ..
తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ ఛైర్మన్‌ అరికెపూడి గాంధీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్ల పర్వం సాగుతోంది. గాంధీ ఇంటిపైన ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేస్తానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఇద్దరు నాయకుల మధ్య వార్‌ ఆఫ్‌ వర్డ్స్‌ నడుస్తుంది. మాటలు కాస్త కోటలు దాగి చేతల వరకు చేరుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన నాయకులు నువ్వా నేనా అన్నట్లు కోట్లాడుకుంటున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన అరికెపూడి గాంధీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి వాదోపవాదాల స్ధాయి దాటి దాడులు చేసుకునే వరకూ పరిస్థితి చేరింది. అరికెపూడి గాంధీపై పాడె కౌశిక్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగుర వేస్తానని కౌశిక్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఆయన చేసిన ఈ సవాల్‌ పై అరికెపూడి గాంధీ కూడా ఘాటుగానే స్పందించారు. నువ్వు 11 గంటల వరకు రాకపోతే.. 12 గంటలకు నేనే మీ ఇంటికి వస్తానని గాంధీ .. కౌశిక్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు.

చెప్పినట్లుగానే వెళ్లి..
కౌశిక్‌రెడ్డి రాకపోవడంతో గాంధీ తన అనుచరులతో పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గాంధీ అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గాంధీ అనుచరులు టమాటాలు, కోడిగుడ్లతో దాడిచేశారు. రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో కౌశిక్‌ బయటకు రాలేదు. గాంధీ మాత్రం కాసేపు అక్కడే బైఠాయించారు. దీంతో వారిని పంపించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.