Kalvakuntla Kavitha : విమానం దిగిన తర్వాత నేరుగా విమానాశ్రయంలోని లాంజ్ లోకి వెళ్లిపోయారు. అక్కడ దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నారు. అక్కడ స్నాక్స్ కూడా తిన్నారు. అనంతరం కొద్దిసేపు తన అంతరంగీకులతో చర్చించారు. లేఖ విషయంలో ఏం మాట్లాడాలి అనే దానిపై కసరత్తు చేశారు. ఆ తర్వాత విలేకరులతో ఆమె మాట్లాడారు. లెటర్ రాసిన తనే అని కుండబద్దలు కొట్టారు. మొత్తానికి ఈ విషయంలో డిఫెన్స్ చేసుకోవడానికి గులాబీ పార్టీకి అవకాశం లేకుండా చేశారు. మొత్తంగా తన అసంతృప్తిని మొత్తం ఈ లెటర్ ద్వారా కవిత బయటపెట్టారు. సానుకూల అంశాలను కొన్ని మాత్రమే ప్రస్తావించి.. పార్టీలో జరుగుతున్న వ్యతిరేక ధోరణులను బయట పెట్టారు. ఒక రకంగా పార్టీలో ఉంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఓపెన్ గా చెప్పేశారు.
Also Read : కల్వకుంట్ల కవిత.. మరో షర్మిల అవుతుందా?
అపాయింట్మెంట్ దొరికింది
ఇటీవల ఒక కుటుంబం కెసిఆర్ ను కలవడానికి ప్రయత్నించింది. వారు కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితులు. అయితే వారికి గులాబీ సుప్రీం దర్శన భాగ్యం లేకుండా మధ్యలో ఉన్నవారు చేశారు. దీంతో ఆ కోటరి పై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ తర్వాత నేరుగా గులాబీ సుప్రీం కు లెటర్ రాశారు. ఇక అప్పటినుంచి పార్టీలో ఆ కోటరీ వర్సెస్ కల్వకుంట్ల కవిత అన్నట్టుగా వ్యవహారం మారిపోయింది. అయితే ఇంటర్నల్ గా ఉండాల్సిన ఈ లెటర్ బయటకి రావడం పట్ల కవిత ఆగ్రహంగా ఉన్నారు. ఇది కోవర్టుల పని అని ఆమె నేరుగా చెప్పేశారు. అయితే దీనిపై తన తండ్రితో శనివారం నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకుంటారని తెలుస్తోంది. విమానాశ్రయంలో దిగిన తర్వాత నేరుగా కవిత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే కవిత తన నివాసానికే వెళ్లిపోయారు. అయితే శనివారం తన తండ్రి కేసీఆర్ను ఆమె కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కవిత రాసిన లేఖలపై అటు కెసిఆర్, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మౌనంగానే ఉన్నారు. మరోవైపు కవితకు తన తండ్రి నుంచి పిలుపు వచ్చిందని కూడా ప్రచారం జరుగుతున్నది. దీనిని కవిత సన్నిహితులు కూడా ధృవీకరిస్తున్నారు.
తను రాసిన లెటర్ బయటకు రావడం పట్ల తండ్రి ఎదుట కవిత ఏ విధంగా స్పందిస్తారు? తండ్రితో ఏం మాట్లాడుతారు? అనే విషయాలపై మరికొద్ది గంటల్లో క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కవిత పలు సందర్భాల్లో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె వాపోయారు. చివరికి తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ తనని ఇబ్బంది పెడుతున్న ఆ వ్యక్తులు ఎవరు? అలా తనను ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలను కూడా తన తండ్రితో కవిత చెబుతారని.. ఆమె సన్నిహితులు అంచనా వేస్తున్నారు.