Electricity Inquiry Commission: తెలంగాణ విద్యుత్‌ ఒప్పందాల విచారణ : కమిషన్ చైర్మన్ ను మార్చి ట్విస్ట్ రేవంత్.. కేసీఆర్ కు ఏమవుతుందో?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి 2014లో నాటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది.

Written By: Raj Shekar, Updated On : July 30, 2024 4:06 pm

Electricity Inquiry Commission

Follow us on

Electricity Inquiry Commission: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు అధికంగా ఉండేవి. నాడు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే.. అంధకారం అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నక్సలిజం పెరుగుతుందని ఏపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో 2014 జూలై 2న ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా నాటి టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ నలుగురూ నవ్వుకునేలా ఉండకూడదన్న లక్ష్యంతో విద్యుత్‌ కోతల నివారణకు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ సరిపోకపోవడంతో పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. నిపుణులతో చర్చించి విద్యుత్‌ కొనుగోలుకు ఓకే చెప్పారు. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నారు. తర్వాత రాష్ట్రంలో రాష్ట్ర అవసరాలకు సరిపడే విద్యుత్‌తోపాటు, మిగులు విద్యుత్‌ను అమ్మేలా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం చేపట్టారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఇదే మసయంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. దీంతో విద్యుత్‌ సంస్థలకు ఇవ్వాల్సిన బిల్లులు కోట్లల్లో పేరుకుపోయాయి. డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి. కాశేశ్వరం లిఫ్ట్‌ల ప్రారంభం తర్వాత విద్యుత సంస్థల బకాయిలు మరింత పెరిగాయి. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో చేసిన అవకలవకలపై జస్టిస్‌ నర్సింహారెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది.

సుప్రీం తీర్పుతో తప్పుకున్న నర్సింహారెడ్డి..
విచారణను వేగంగా చేపట్టిన నర్సింహారెడ్డి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని భావించారు. ఈ క్రమంలో విచారణలో దూకుడు పెంచారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యుత మంత్రి జగదీశ్వర్‌రెడ్డితోపాటు మాజీ అధికారుల, ప్రస్తుత అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. అయితే కేసీఆర్‌ విచారణకు రాకుండా రాతపూర్వకంగా సమాధానం పంపించారు. దానితో సంతృప్తి చెందని నర్సింహారెడ్డి స్వయంగా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే అంతకు ముందు ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వమించారు. దీనిని తప్పు పట్టిన కేసీఆర్‌.. కమిషన్‌ చైర్మన్‌ తీరుపై హైకోర్టున ఆశ్రయించారు. హైకోర్టులో కేసీఆర్‌కు ఊరట లభించలేదు. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం ధర్మాసనం చైర్మన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించడాన్ని తప్పు పట్టింది. నర్సింహారెడ్డిని తప్పించి కొత్త చైర్మన్‌ను నియమించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. దీంతో నర్సింహారెడ్డి తప్పుకున్నారు.

కొత్త చైర్మన్‌గా లోయూర్‌..
తెలంగాణ విద్యుత్‌ రంగంలో గత ప్రభుత్వ అవకతవకలపై ఏర్పాటు చేసిన విద్యుత్‌ కమిషన్‌కు జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నేతృత్వం వహించనున్నారు. ఈమేరకు చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన విచారణ చేయనున్నారు. పాత చైర్మన్‌ నర్సింహారెడ్డి ఇప్పటి వరకు చేసిన విచారణ నివేదికలను లోకూర్‌కు అప్పగిస్తారు. అయితే విచారణ మాత్రం మొదటి నుంచి జరిపే అవకాశం ఉంది.

సుప్రీం కోర్టు, ఏపీ హైకోర్టు జడ్జిగా..
ఇక జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌.. గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేశారు. జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌ 1974లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి చరిత్ర(ఆనర్స్‌)లో పట్టభద్రులయ్యారు. తర్వాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1977లో ఢిల్లీ యూనివర్సిటీలో లా ఫ్యాకల్టీ నుంచి పట్టా పొందారు. జస్టిస్‌ లోకూర్‌ జూలై, 1977లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. భారత సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 1997, ఫిబ్రవరిలో సీనియర్‌ న్యాయవాదిగా నియమించబడ్డారు. 1998, జూలై 14న భారత అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితుడయ్యారు. 1999 జూలై 5న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, మే వరకు ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత గౌహతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఒకేసారి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 ఆగస్టు 12 నుంచి ఫిజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.