Dokka seethamma: డొక్కా సీతమ్మ.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది.దీంతో డొక్కా సీతమ్మ గురించి బలమైన చర్చ ప్రారంభమైంది.ఆమె ఎవరు? స్వాతంత్ర సమరయోధురాలా? దేశ నాయకురాలా? అంటూ అందరిలో అనుమానం ప్రారంభమైంది. ఆమె గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొక్కా సీతమ్మ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆమె పేరిట క్యాంటీన్లను తెరుస్తామని ప్రకటించారు. అయినా సరే డొక్కా సీతమ్మ గురించి ఎక్కువమందికి తెలియదు. తాజాగా ప్రభుత్వం ఆమె పేరును గౌరవిస్తూ పథకానికి పెట్టిన వేళ.. ఆమె గురించి ఒకసారి సమగ్రంగా తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో1841లో డొక్కా సీతమ్మ జన్మించారు. చిన్నతనంలోనే తల్లి నరసమ్మ చనిపోయారు. ఇంటి పనులు చక్కదిద్దడం, అతిధులకు, చుట్టాలకు మంచి ఆతిధ్యం ఇవ్వడం, ఆప్యాయతతో గౌరవించడం ప్రాథమిక స్థాయి నుంచి అలవర్చుకున్నారు. అందుకే ఆమె తండ్రి భవాని శంకరాన్ని అంతా బువ్వన్నగా పిలుచుకుంటారు. సీతమ్మకు యుక్త వయసు రాగానే లంకల గన్నవరం గ్రామానికి చెందిన వేద పండితులు డొక్కా జోగన్నతో వివాహం జరిగింది. ఆకలి అన్నవారికి అన్నం పెట్టే అవకాశం ఇస్తేనే తాను వివాహం చేసుకుంటానని సీతమ్మ అప్పట్లో కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు జోగన్న అంగీకరించి సీతమ్మను వివాహం చేసుకున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సీతమ్మ తన సేవా ప్రస్థానాన్ని కొనసాగించారు. పేదల ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సైతం సాయం అందించేవారు ఆమె. రోజు వందలాది మంది బాటసారులు, పేదలకు ఆమె ఉచితంగా భోజనాలు పెట్టేవారు. ప్రకృతి విపత్తుల సమయంలో నిరాశ్రయులకు కడుపు నింపేవారు. అలా ప్రాచుర్యం పొందారు డొక్కా సీతమ్మ. గోదావరి జిల్లాల అన్నపూర్ణగా ఎక్కువమంది ఆమెను అభివర్ణించేవారు.
* గోదావరి జిల్లాల అన్నపూర్ణ
గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ పేరు సుపరిచితం. ఆమె ఎంతగానో ప్రాచుర్యం పొందారు. ఆమెను గోదావరి ప్రజలు కీర్తించేవారు. 60 సంవత్సరాల క్రితమే నిడదవోలు లో స్వాతంత్ర్య సమరయోధుడు చింతలపాటి మూర్తి రాజు డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ధర్మ సంస్థల తరఫున ఏర్పాటు అయిన పాఠశాలకు డొక్కా సీతమ్మ ఓరియంటల్ పురపాలక ఉన్నత పాఠశాల గా నామకరణం చేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకు వేలాదిమంది విద్యార్థులు అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన స్వతంత్ర సమరయోధులకు, సీనియర్ నేతలకు డొక్కా సీతమ్మ చరిత్ర తెలుసు. ఆమె ఔన్నత్యం తెలుసు.
* పవన్ ప్రత్యేక ప్రస్తావన
అయితే ఈ తరం వారికి తెలిసేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ముందు డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు తెస్తామని పవన్ ప్రకటించారు. అప్పట్లోనే ఆమె పేరు చర్చనీయాంశంగా మారింది. అందరూ దేశ నాయకురాలిగా భావించారు. కానీ ఆమె పేదల కడుపు నింపిన అన్నపూర్ణగా తెలిసింది కొంతమందికే. తాజాగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం.. మరోసారి వార్తల్లో నిలిచారు ఆమె. దీంతో ఎక్కువ మంది గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఆమె పేరును వెతికే ప్రయత్నం చేశారు.
* పథకాల పేర్లు మారాయి
ఇటీవల నారా లోకేష్ విద్యా శాఖకు సంబంధించి సంక్షేమ పథకాల పేర్లు మార్చారు. దేశ నాయకులతో పాటు మహనీయుల పేర్లను జత చేశారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీల నేతలు, పార్టీ అధినేతల పేర్లతో పథకాలు నడిచాయి. కానీ పవన్ పుణ్యమా అని పేర్లు మార్పు చేసుకున్నాయి. ప్రభుత్వ పథకాలకు రాజకీయ నేతల పేర్లు పెట్టడం తనకు నచ్చదని పవన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు పవన్ డొక్కా సీతమ్మ పేరును ప్రతిపాదించారు. అయితే ఇప్పటికే అన్న క్యాంటీన్లు ఉండడంతో.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కడుపు నింపే పథకానికి ఆమె పేరు పెట్టడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Dokka seethamma midday meal scheme in andhra pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com