TV9: ఒక ఈనాడు టిడిపికి అనుకూలంగా రాస్తుంది. జగన్ అంటే మండిపడుతుంది. దాని ఓనర్ రామోజీరావు ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. దాని దృష్టిలో రామోజీ ఫిలిం సిటీ ఒక స్వర్గధామం. తన ఓనర్ రామోజీరావు ముందు అందరూ మోకరిల్లాలి అనుకుంటుంది. అంతటి మోడీ కూడా ఎదురుగా కూర్చోవాలి అని భావిస్తూ ఉంటుంది. ఇందులో తప్పులేదు. ఈనాడేం శంకరగిరి మఠం కాదు. దేశ సేవ చేయడానికి.. అది కూడా ఒక ఫంక్తు ప్రైవేట్ కంపెనీ.. ఇక ఇంతకంటే గొప్పగా దాని గురించి చెప్పేదేమీ ఉండదు. ఒక ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ కూడా ఇంతే.. వాటి ఓనర్ల అభిరుచులకు అనుగుణంగా అవి నడుచుకుంటాయి. తేడా అనిపిస్తే ఎదుటివాడిని మీద బురద చల్లుతాయి. ఆ బురదని కడుక్కోవడం ఇక వాడి ఖర్మ. కేవలం పేపర్లు మాత్రమే కాదు న్యూస్ చానల్స్ కూడా ఇదే జాబితాలో ఉంటాయి.
తెలుగు నాట 24 గంటల న్యూస్ ఛానల్ గా అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం టీవీ9 ప్రారంభమైంది. అప్పట్లో ఆ ఛానల్ ను ప్రారంభించింది రవి ప్రకాష్. సహజంగానే రవి ప్రకాష్ డేరింగ్ జర్నలిస్టు. మిగతా మరకలు ఎలా ఉన్నా టీవీ9 ఛానల్ ను ఒక రేంజ్ లోకి తీసుకెళ్లిన ఘనత అతడిదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ కంటే టీవీ9 టాస్క్ ఫోర్స్ కు ఫోన్ చేస్తేనే న్యాయం జరుగుతుందని అప్పట్లో జనం నమ్మారంటే.. ఆ ఛానల్ క్రెడిబిలిటీ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఛానల్ రవి ప్రకాష్ కంట్రోల్ లో ఉన్నప్పుడు పిరమిడ్ ధ్యాన కేంద్రం అధిపతి సుభాష్ పత్రీజీ మీద ఏవేవో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేయడం.. అధికారులు విచారణ చేయటం.. తదుపరిగా ఆ సంస్థ ప్రతిష్ట కొంత మేర మసకబారడం జరిగిపోయాయి. ఇదే క్రమంలో టీవీ9 కూడా చేతులు మారింది. తన మానస పుత్రికగా ఉన్న ఈ ఛానల్ నుంచి రవి ప్రకాష్ బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. అప్పటి ప్రభుత్వం కూడా ఇందుకు సహకరించింది. ఎందుకంటే ఈ ఛానల్ ని కొనుగోలు చేసిన వ్యక్తి తమకులపోడే కాబట్టి.. అప్పటి ప్రభుత్వ పెద్దలు గట్టిగానే సహకరించారు.
అయితే ఇటీవల హైదరాబాదులో ఇదే సుభాష్ పత్రీజీ ధ్యాన యోగ కేంద్రంలో ఒక ఆధ్యాత్మిక సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ బిల్డర్, మహా సిమెంట్స్ ఓనర్, టీవీ9 ఓనర్ జూపల్లి రామేశ్వరరావు హాజరయ్యారు. సహజంగానే ఈయనకు ఆధ్యాత్మిక భక్తి ఎక్కువ అంటారు. అలాంటి ఈ వ్యక్తి సుభాష్ పత్రీజీ ఆధ్యాత్మిక యోగ కేంద్రంలో ఆవేశంగా మాట్లాడారు. అప్పట్లో టీవీ9 ఛానల్ లో సుభాష్ పత్రీజీ మీద వ్యతిరేక వార్తలు ప్రసారం అయ్యాయని, ఇకమీదట అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పట్లో ఆ ఛానల్ నక్సలిజం భావాలతో నడిచేదని.. ఇప్పుడు దానిని పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో పయనింప చేస్తానని గట్టిగా అన్నారు. ఈ మాటలకు ధ్యాన యోగా కేంద్రంలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టారు.
కానీ ఇక్కడ రామేశ్వరరావు మర్చిపోయిందంటే.. ఛానల్లో ప్రసారమయ్యే వార్తలు దాని ఓనర్ అభిరుచికి అనుగుణంగా ఉంటాయి. నచ్చితే జనం చూస్తారు.. లేకుంటే మానేస్తారు.. అప్పట్లో రవి ప్రకాష్ అండర్ లో టీవీ9 ఉండేది కాబట్టి.. సుభాష్ ధ్యాన యోగ కేంద్రంలో రకరకాల అక్రమాలు జరుగుతున్నాయని అభియోగాలు వచ్చాయి. వాటిని రూడీ చేసుకున్న తర్వాతే టీవీ9 కథనాలు ప్రసారం చేసింది. అఫ్కోర్స్ అలాంటి వాటిని రవిప్రకాష్ అప్పట్లో ఎంకరేజ్ చేసేవాడు. అతని అభిరుచి అది. దాన్ని తప్పుటాల్సిన అవసరం ఏముంది. ఒకవేళ టీవీ 9 ప్రసారం చేసింది నిరాధార కథనాలు అయితే కచ్చితంగా కోర్టుకి వెళ్లేవారు. టీవీ9 ను బోనులో నిలబెట్టేవారు. కానీ అలా జరగలేదంటే అక్కడేదో మాడు వాసన వస్తున్నట్టే కదా.. మరి దానికి రామేశ్వరరావు ఎందుకు ముక్తాయింపు ఇస్తున్నారు? సుభాష్ కు ఎందుకు సారీ చెప్పారు? ఈ మాత్రం ప్రజలకు అర్థం కాదా ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు సారీ ఆ స్థానంలో న్యూస్ చానల్స్ అని చదువుకోండి.