Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు కల్వకుంట్ల కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 10న కవితను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సీబీఐ, తర్వాత ఆమెను కోర్టులో హాజరు పర్చింది. 5 రోజుల కస్టడీ కోరగా, మూడు రోజుల కస్టడీకి జడ్జి అనుమతిచ్చారు.
కస్టడీ ముగియడంతో కోర్టుకు..
ఆదివారంతో సీబీఐ మూడు రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం(ఏప్రిల్ 15న) రౌస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. ఈ సందర్భంగా మరో 14 రోజుల కస్టడీ కావాలని సీబీఐ కోర్టును కోరింది. ఈమేరకు కొన్ని ఆధారాలు చూపించింది. అయితే కోర్టు 9 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో జుడీషియల్ కస్టడీ ఈనెల 23 వరకు కొనసాగనుంది.
మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహం..
ఇక కవిత కోర్టుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడడంపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా సీరియస్ అయ్యారు. కోర్టు ఆవరణలో మీడియాతో ఎలా మాట్లాడాతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా మాట్లాడొద్దని మందలించారు. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు.
బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ..
ఇదిలా ఉండగా సీబీఐ అరెస్టుపై బెయిల్ ఇవ్వాలని కవిత ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఈమేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై ఈనెల 22న విచారణ జరుపుతామని తెలిపింది. మరోవైపు ఈడీ అరెస్టు కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై రేపు(ఏప్రిల్ 16న) రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది. ఇందులో బెయిల్ వచ్చినా.. కవిత బయటకు వచ్చే అవకాశం లేదు. సీబీఐ కేసులో కూడా బెయిల్ వస్తేనే కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుంది.