Congress Ministers: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంజీవనిగా మారింది. ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. పార్టీ మీద పట్టు పెంచుకున్నారు. పార్టీ హై కమాండ్ కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలవడం.. ఇద్దరు మంత్రుల పోస్టులను ఊస్ట్ అయ్యేలా చేస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అందరి మంత్రులకు అప్పగించింది. అయితే ఇందులో దక్షిణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు సరిగ్గా పనిచేయలేదు. కార్యకర్తలకు అందుబాటులో లేరు. పైగా టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించారు. సదరు మంత్రుల పనితీరుపట్ల అధిష్టానానికి ఇంటలిజెన్స్ వర్గాలు నివేదిక అందించినట్లు తెలుస్తోంది. పైగా ఆ ఇద్దరు మంత్రులు తమకు కేటాయించిన డివిజన్లలో చుట్టపుచూపుగా వచ్చి ప్రచారం చేశారు. సీరియస్ ఎఫర్ట్ పెట్టలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన పార్టీ హై కమాండ్ వారిని వివరణ ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అందరికీ అప్పగించింది. ఒక్కో డివిజన్ కు ఇద్దరు మంత్రులను ఇన్చార్జులుగా నియమించింది. ఇన్చార్జిలంతా తమ జిల్లాలలో.. నియోజకవర్గాలలో నాయకులను, ఇతర కార్యవర్గాన్ని తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం జరపాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ఆమె ఆదేశాల మేరకు మంత్రులు మొత్తం ప్రచార బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.
ఆ ఇద్దరు మంత్రులు అంతంత మాత్రమే పనిచేశారు. పైగా పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు డివిజన్ బాధ్యతలు అప్పగించడం పట్ల వారు నారాజ్ గా వివరించినట్టు సమాచారం. పైగా తమ నియోజకవర్గం నుంచి నాయకులను, లీడర్లను ప్రచారంలో ముందుండేలా చేయలేదని ఆరోపణలు వినిపిస్తుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని ఆ ఇద్దరు మంత్రులు కోరుకున్నారని హైకమాండ్ కు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీనాక్షి తో పాటు రేవంత్ రెడ్డికి కూడా అందించాయి.
ఇందులో ఒక మంత్రి పార్టీ ఇచ్చిన డబ్బులు పూర్తిస్థాయిలో ఖర్చుపెట్టలేదని.. చాలావరకు మిగిలించుకొని తన జేబులో వేసుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఇద్దరు మంత్రులు గనుక తమ వ్యక్తిగత ఎజెండాను పక్కనపెట్టి ముందుకు వెళితే.. ప్రచారం సక్రమంగా చేస్తే మెజారిటీ ఇంకా ఎక్కువగా వచ్చేదని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని కోరుకున్న ఆ ఇద్దరు మంత్రుల పోస్టులు ఊస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అధిష్టానం వర్తమానం పంపడంతో ఇప్పటికే ఒక మంత్రి ఢిల్లీకి వెళ్లి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో మంత్రి హస్తిన వెళ్లడం లేదా మెయిల్ ద్వారా తన వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.