Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. భారత రాష్ట్ర సమితి తన అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి ని నియమించింది. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టింది. ఇతర ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ కొంతమంది అభ్యర్థులతో జాబితాను రూపొందించి అధిష్టానానికి పంపించింది. బిజెపి కూడా ఒక కమిటీని నియమించి అభ్యర్థుల ఎంపిక విషయంలో మల్లా గుల్లాలు పడుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. నవీన్ యాదవ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉండడంతో ఆయనకే టికెట్ లభిస్తుందని అంచనాలున్నాయి. ఈ క్రమంలో నవీన్ యాదవ్ కూడా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల జాబితా కూడా అధికంగా ఉండడంతో టికెట్ దక్కే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో కేడర్ కూడా అయోమయంలో ఉంది. ఇదంతా జరుగుతుండగానే నవీన్ యాదవ్ కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. దీంతో అధికార పార్టీలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ పై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఓటర్లకు ఆయన ఓటర్ కార్డులు పంపిణీ చేశారు. ఎన్నికల నిబంధనలను ఆయన పూర్తిగా ఉల్లంఘించారు. ఈ మేరకు కొంతమంది ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. నిజమని నిర్ధారించడంతో ఉల్లంఘన జరిగిందని తేటతెల్లమైంది. దీంతో మధుర నగర్ పోలీసులు నవీన్ యాదవ్ పై కేసు నమోదు చేశారు.
నవీన్ యాదవ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టికెట్ దక్కే అభ్యర్థుల జాబితాలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ చేయడానికి రేవంత్ రెడ్డి ఏకంగా అజహారుద్దీన్ ను కూడా పక్కకు తప్పించారు. ఆయనకు ఏకంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. మరి కొద్ది రోజుల్లో టికెట్ తెచ్చుకొని, పోటీకి సిద్ధంగా ఉంటారు అనుకుంటున్న క్రమంలో నవీన్ యాదవ్ పై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడం సంచలనం కలిగిస్తోంది. అయితే ఇలాంటివి తనపై ఎన్ని నమోదైనప్పటికీ కూడా పోటీ చేయకుండా ఉండేది లేదని.. ఇలాంటి వ్యవహారాలు తనను దెబ్బతీయ లేవని నవీన్ యాదవ్ అంటున్నారు.