Jubilee Hills by Election: తెలంగాణ రాజధాని విశ్వనగరం హైదరాబాద్‌లోని కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక రాజకీయంగా హాట్‌స్పాట్‌గా మారింది. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. తన ఖాతాలో వేసుకోవాలని అధికార కాంగ్రెస్ తహతహలాడుతోంది. రాజాసింగ్ పార్టీని వీడిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్‌లో కాషాయ జెండ ఎగరేసి తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని నిరూపించాలని కమలనాథులు ఉబలాటపడుతున్నారు. గెలుపు కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. రాబోయే నవంబర్ 11 పోలింగ్‌తో ఈ పోరు ఒకే నియోజకవర్గం వరకే కాక, నగర రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపనుంది.
సిట్టింగ్ సీటును కాపాడుకునేలా..
మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని దక్కించుకోవటానికి బీఆర్‌ఎస్ ఆయన భార్య సునీతను బరిలోకి దింపింది. కుటుంబ వారసత్వం, సానుభూతి ఓట్లు బలంగా ఉన్నప్పటికీ అనుభవలేమి, ప్రతిపక్ష రాజకీయాల్లో ఆడ్వాంటేజ్ సృష్టించుకోవడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. పార్టీ అగ్రనేతల మద్దతుతో ఈ సీటు నిలబెట్టుకోవడం బీఆర్‌ఎస్‌కు ప్రాణాధారమవుతుంది.
అధికార బలం.. స్థానిక సమీకరణ..
ఇక అధికార కాంగ్రెస్ అధికార బలంతోపాటు బీసీ కమ్యూనిటీకి చెందిన స్థానిక నేత నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపికచేసింది. స్థానిక అనుబంధాలను సద్వినియోగం చేసుకునే వ్యూహం ఎంచుకుంది. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌కు ఉన్న పాత రాజకీయ బలం కూడా అదనపు మద్దతు ఇవ్వవచ్చు. అయితే పాత కాంగ్రెస్ వర్గాలు, పీజేఆర్ అభిమానులు ఇప్పుడు ఎటు మళ్లుతారన్నది కీలకం.
అభ్యర్థి వేటలో బీజేపీ..
ఇక 2023 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన దీపక్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇవ్వాలా లేక కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలా అనే విషయంలో బీజేపీ ఉంది. ఈ ప్రాంతంలో ఆంధ్రా సెటిలర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఏపీ టీడీపీతో వివాదరహిత సంబంధాలు ఉండటం బీజేపీకి బలాన్నిస్తుందని భావిస్తున్నారు. అయితే సుమారు 1.4 లక్షల మైనారిటీ ఓటర్ల ప్రాధాన్యం, వారి ఓటు విభజన లేదా సమీకరణ బీజేపీ గెలుపు సమీకరణాన్ని ప్రభావితం చేసే అంశం.
ఫలితంపై ప్రభావం చూపే కీలక అంశాలు
– మైనారిటీ ఓటు ఎటు ఒక్కటవుతుందో
– సానుభూతి తరహా ఓటు ఎంతవరకు బీఆర్‌ఎస్‌కు ఉపయోగపడుతుందో
– స్థానిక బీసీ అభ్యర్థి ప్రభావం కాగ్రెస్‌కు ఎంత బలాన్నిస్తుందో
– బీజేపీ టికెట్ ఎంపిక, ఆంధ్రా సెటిలర్ మరియు హిందూ ఓటు బేస్ సమీకరణ
గత ఎన్నికల ఫలితాలు ఇలా..
2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ (బీఆర్‌ఎస్) 80,549 ఓట్లు గెలిచి, కాంగ్రెస్ అభ్యర్థి మోహమ్మద్ అజరుద్దీన్ 64,212 ఓట్లు పొందారు. బీజేపీ దీపక్ రెడ్డి 25,866 ఓట్లతో మూడో స్ధానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో సుమారు 3.85 లక్షల మంది ఓటర్లు ఉండగా, మైనారిటీల సంఖ్య 1.20 లక్షలకి పైగా ఉంది. ఈ మైనారిటీ ఓటర్లు ఏ పార్టీకి వస్తే ఫలితం ఆ ఆర్టీకే అనుకూలంగా ఉంటుంది.
వ్యూహాలు, సవాళ్లు
– బీఆర్‌ఎస్ సునీత ఆధారంగా సానుభూతి ఓట్లు ఆశించగా, అనుభవ లేమితో కూడిన సవాళ్లు ఎదుర్కొంటోంది
– కాంగ్రెస్ నవీన్ యాదవ్ స్థానిక ఉద్యమానికి బలం ఇచ్చే ప్రయత్నంలో ఉంది
– బీజేపీ అభ్యర్థి ఎంపిక వేగంగా చేయకపోవడం, మైనారిటీ ఓట్ల విభజన సమస్యలు తదితర అంశాలు దృష్టిలో ఉన్నాయి.