Jubilee Hills By Election: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం(నవంబర్ 9) సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. మైకులు, రథాలు, ర్యాలీలు అన్నీ మూగబోనున్నాయి. దీంతో చివరి రోజు ప్రచారం జోరుగా సాగించేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. చివరి నిమిషం వరకు తమ ప్రాభవాన్ని చూపించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
మాటల తూటాలు..
ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్, అధికారంలో ఉన్నాం కాబట్టి గెలిచి తీరాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. ఇక ఇక్కడ సత్తాచాటి తెలంగాణలో నెక్ట్స్ బీజేపీదే అని సంకేతం ఇవ్వాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు పార్టీల నాయకుల ప్రచారం చివరి రోజు ప్రత్యర్థులపై మాటల తూటాలతో దండయాత్ర చేస్తున్నారు. అభ్యర్థుల విజయాన్ని పార్టీ ప్రతిష్టగా మార్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రచారం పీక్‌కు చేరింది.
ఓటర్లను ఆకట్టుకునేలా..
పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రతి ఓటరిని వ్యక్తిగతంగా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్వీయ అభివృద్ధి వాగ్దానాలు, స్థానిక సమస్యల పరిష్కార హామీలు, మత–జాతి ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి రహదారిగా తామే నిలుస్తామన్న ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రచార సమయం ముగిసిన వెంటనే హైదరాబాద్ పోలీసు బలగాలు ఎలక్షన్ కోడ్ అమలులోకి దిగి కఠిన పర్యవేక్షణ మొదలుపెట్టనున్నాయి. పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి నవంబర్ 11న సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్ షాపులు, బార్లు మూసివేస్తారు.
ప్రచారం ముగిసిన వెంటనే ప్రలోభాలకు తెరతీయనున్నారు. ప్రచారంలో చివరి రోజు ర్యాలీలు, పాదయాత్రలు చేశారు. రాత్రి నుంచే డబ్బుల పంపిణీకి సిద్ధమవుతున్నారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులూ వ్యూహం రూపొందిస్తున్నారు.