Journalist : పత్రికలు మారాయి.. ప్రయార్టీ మారింది.. మరి నేనెందుకిలా..?

పత్రికారంగం రోజురోజుకూ కుదేలవుతున్నట్లుగానే కనిపిస్తున్నది. డిజిటల్ యుగం వైపు ప్రపంచం వేగంగా దూసుకెళ్తున్న వేళ.. రోజు మారితే పత్రికలు చిత్తు కాగితల్లా మారుతున్నాయి. ఇది బాధ కలిగించే అంశమే.

Written By: NARESH, Updated On : November 9, 2024 7:48 pm
Follow us on

journalist: నా బాల్యం 90వదశకంలో గడిచిపోయింది.. చిన్నప్పుడు పొద్దున్నే లేచి నాన్న బర్రె పాలు పిండితే, నేను రెండు, మూడు ఇండ్లలో పోసి వచ్చేవాన్ని. అప్పుడు అదో సరదా.. దాని వెనుక అసలు కారణం వేరే ఉందండోయ్. ఎందుకంటే.. నేను అలా పాలు పోసే మా బంధువుల ఇంట్లో న్యూస్ పేపర్( తెలుగులో ప్రముఖ పత్రిక) పడేది. వారిది హోటల్ కాబట్టి అక్కడ న్యూస్ పేపర్ కోసం ఎక్కువ మంది వచ్చేవారు. అందులో మొదటి కస్టమర్ నేనే అనుకుంట. హోటల్ కు కాదండి.. పేపర్ కు. అలా ఉదయం న్యూస్ పేపర్ చదవందే నా మనసు ఒప్పుకునేది కాదు. నాకు మంచి స్ట్రాంగ్ టీ తాగినా కిక్కు పేపర్ చదివితేనే అన్నమాట. ఒకవేళ ఆ ఇంటికి పేపర్ రాకుంటే ఆ రోజంతా పేపర్ ఎక్కడ దొరుకుతుందా అనేది వెతికేది. ఒక్కోసారి ఎక్కడైనా కనబడితే మెల్లిగా మడతబెట్టి జేబులో పెట్టుకొని వచ్చేది. అంత ఇష్టం. అప్పుడు పేపర్ చదవడంలో ఆ ఫీలింగే వేరు. పేపరంతా చదివి ఇంటికి వచ్చేసరికి ఒక్కోసారి ఆలస్యమయ్యేది. దీంతో ఇంట్లో తిట్లు తప్పేవి కాదు. సారు గారికి పేపర్ చదవందే మనసున పట్టదని మా అమ్మ.. అదేదో నీ పుస్తకాలు చదవచ్చు కదరా.. అని మా నాన్న.. వాళ్లు ఇద్దరూ అంటుంటే నవ్వుతూ మా చెల్లి.. నాకైతే భలే ఉండేది ఆరోజులు. అలా పేపర్ చదవందే నా దినచర్య మొదలయ్యేది కాదు. దాదాపు పదేండ్ల పాటు అదే నా పని. అప్పుడంటే ఒకటి రెండు పేపర్లు మాత్రమే ఊళ్లలో కనిపించేవి.

ఇక మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్తే ఇక ఆ పేపర్ ఉండేది కాదు. ఆ ఊరికి బస్సు వస్తనే పేపర్. అప్పుడు నడిచేదే ఒక్కటే బస్సు. అది వస్తుందా.. రాదా మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఆ బస్సు వచ్చిందంటే నా సంతోషం అంతా ఇంతా కాదు. అలా పేపర్ కోసమే కాపలా కాసిన రోజులు ఉన్నాయి. అదేంటో నా తృప్తి అలా ఉండేది.

ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇంట్లో రెండు, మూడు పేపర్లు ఉన్నా ముట్టాలనిపించడం లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్న వార్తల వేడి ఏది? ఛేజింగ్, ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ ఏది? ఎంతసేపు రాజకీయ వార్తలు తప్ప. బూతుల పురాణం.. సినిమా గాసిప్పులు, రాజకీయనేతల ఉపన్యాసాలు, తిట్లే ఇప్పుడు సెన్షేషనల్ వార్తలవుతున్నాయి. ఎవరి బాకా వారిది.

పార్టీకో పత్రికలా పరిస్థితి మారిపోయింది. అసలు ఏది నిజమో తెలుసుకునేందుకు తల పట్టుకోవాల్సి వస్తున్నది. ఒక్కో పేపర్ లో ఒక్కోలా. డిజిటల్ సైట్లు ఇంతకన్నా ఎక్కువే బాకా.. వార్తా పత్రికను చూడగానే చదవాలని అనిపించేలా ఉండాలి. ఒక పండును ఎలా ఇష్టంగా తింటామో.. అలా ఇష్టంగా పేపర్ ను చదవగలగాలి. ఆ రోజులు మళ్లీ వస్తాయా అంటే అనుమానమే.

జర్నలిజం రూపమే మారిపోయింది. నాడు బస్సు ఎక్కితే పేపర్ చేతులో ఉండాల్సిందే. నేడు బస్టాండుల్లోని షాపులకు తోరణంలా వేలాడుతున్న ఆ పేపర్లను చూసి బాధేస్తున్నది. నాడు పేపర్ బాయ్ ఎక్కడ కనిపిస్తాడా అని వెతికేది. మరి ఇప్పుడు కనిపించినా ఏం కొంటాంలే అనిపిస్తున్నది. మరి మార్పు ఎక్కడ వచ్చింది. ఊరుకో పేపర్ పుట్టుకొస్తున్న ఈ వేళ.. ప్రధాన పత్రికల మేనేజ్మెంట్ల ప్రాధాన్యాలు మారాయి. డిజిటల్ వైపు ప్రపంచమంతా వేగంగా సాగుతున్నా ఇప్పటికీ ఆ పేపర్ చదవడమే బెటర్ అనిపిస్తుంది నాకు.

వార్తను వార్తలాగా ఇవ్వగలిగితే బాగుండేది. అది ఆ యాజమాన్యం వ్యూస్ లాగా మారిపోయింది. ఏదేమైనా న్యూస్ పేపర్ ను బతికించుకోవాలనుకునే అభిమానిని నేను. ఈ ఇష్టం ఇప్పటిది కాదు. 30 ఏండ్ల క్రితం పుట్టింది. ఆ ఇష్టం చావదు.

-ఇది జర్నలిస్టు గా రాసింది కాదు..
పత్రికాభిమానిగా ఆవేదన.

సత్య వాక్కు.✍️