https://oktelugu.com/

CM Revanth Reddy: నేడే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల… 50 వేల పోస్టులతో సిద్ధం.. అసెంబ్లీలో సంచలన ప్రకటన దిశగా రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం(జూలై 23న) ప్రారంభం కానున్నాయి. ఈసమావేశాల్లో 8 నెలల కాలానికి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే సమావేశంలో ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ కూడా రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 23, 2024 / 10:05 AM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy: తెలంగాణ : 2023 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఆరు గ్యారంటీ స్కీంలతోపాటు 400లకుపైగా హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. ఈ హామీలు.. గత ప్రభుత్వ పదేళ్ల పాలనపై ఉన్న వ్యతిరేకత, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, గ్రూప్‌–1, గ్రూప్‌–2 ప్రశ్నపత్రాల లీకేజీ, ఉద్యోగాల భర్తీలో అలసత్వం తదితర కారణాలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయి. తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్‌ కొలువుదీరి ఏడు నెలలయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశారు. కొత్త కమిటీని నియమించి గ్రూప్‌–1 పరీక్ష నిర్వహించారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించలేదు. ఫిబ్రవరిలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పేర్కొంది. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని నిలదీస్తోంది. ఈ క్రమంలో రేవంత్‌ సర్కార్‌.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ సమావేశాల్లోనే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఇకపై ఏ ఏడాదికి ఆ ఏడాది ఉద్యోగాల భర్తీ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకు ప్రకటించారు. జనవరిలో జాబ్‌ క్యాడెంర్‌ ఇచ్చి.. జూన్, జూలైలో పరీక్షలు నిర్వహించి డిసెంబర్‌లోగా పోస్టులు భర్తీ చేసేలా ఈ జాబ్‌ క్యాండెర్‌ ఉంటుందని తెలుస్తోంది.

    ఎదురు చూస్తున్న నిరుద్యోగులు..
    ఇక తెలంగాణలో జాబ్‌ క్యాలెండర్‌ కోసం నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసే జాబ్‌ క్యాలెండర్‌లో 50 వేల పోస్టులు ఉంటాయని తెలుస్తోంది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏటా మార్చి 31 నాటికి అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తిస్తారు. జూన్‌ 2వ తేదీనాటికి నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. డిసెంబర్‌ 9వ తేదీలోపు నియామక ప్రక్రియ పూర్తిచేసి ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్‌ లెటర్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు అసెంబ్లీ వేదికగా విడుదల చేసే జాబ్‌ క్యాలెండర్‌లో మరిన్ని వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    గందరగోళంగా నియామకాలు..
    ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం ఉద్యోగార్థుల సహనాన్ని పరీక్షించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా నిర్ధిష్టమైన ప్రణాళిక వెల్లడించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి, ఉద్యోగార్థులకు సమన్వయలోపం లేకుండా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది.

    ఈ సమావేశాల్లో పలు బిల్లులు..
    ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం(జూలై 23న) ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. మొదట దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం తెలుపుతారు. అనంతరం సభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) భేటీ ఉంటుంది. ఇందులో అసెంబ్లీ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు మొదలైన వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో స్కిల్‌ యూనివర్సిటీ, ధరణి పోర్టల్‌ సమస్యల పరిష్కారానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

    గెస్ట్‌ లెక్చరర్ల జీతాల పెంపు..
    ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని గెస్ట్‌ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గౌరవ వేతనాల పెంపుపై చర్చించే అవకాశం ఉంది. వారి జీతం రూ.28వేల నుంచి రూ.42వేలకు పెంచుతారని తెలుస్తోంది. రెగ్యులర్‌ లెక్చరర్ల నియామకం జరుగుతున్నందున గెస్ట్‌ లెక్చరర్లను తొలగించకుండా సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఇక.. తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఉపాధ్యాయ పోస్టులను కూడా పదోన్నతులతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖాళీలకు సంబంధించి జిల్లాలు, సబ్జెక్టుల వారీగా జాబితాను రూపొందించమని డీఈవోలను విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1500 ఖాళీలు ఉన్నట్లు అంచనా. అంటే అంతమందికీ ప్రమోషన్లు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.