Jeevan Reddy: తానిపత్తి జీవన్‌రెడ్డి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి. మాజీ ఎమ్మెల్సీ. మూడేళ్ల క్రితం వరకు జీవన్‌రెడ్డికి పార్టీలో ప్రముఖ స్థానం ఉండేది. 2018 సమయంలో ఏకంగా పీసీసీ పదవికి పోటీ పడ్డారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు ఛాలెంజ్ చేసి మంత్రి పదవి వదులుకుని ఎంపీగా పోటీ చేశారు. ఇలా అధిష్టానం ఏం చెబితే అది చేస్తూ విధేయుడిగా కొనసాగారు. కానీ, మూడేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. 2023 ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ ఆయనను క్రమంగా దూరం పెడుతోంది. ఎమ్మెల్సీ పదీకాలం ముగుస్తున్న సమయంలో మరోసారి అవకాశం ఇస్తుందని భావించారు. కానీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు.
సంజయ్‌కుమార్ చేరికతో.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు. కానీ, ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. దీంతో జీవన్‌రెడ్డి ప్రాధాన్యం పార్టీలోనూ తగ్గిపోయింది. ఒకవైపు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్‌కుమార్ ఏడాది తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ కూడా అన్ని విషయాల్లో సంజయ్‌కుమార్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో జీవన్‌రెడ్డిలో అసంతృప్తి పెరిగింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవని, ఒకే పార్టీలో ఇద్దరు ఇన్చార్జీలు ఉండలేరని జీవన్‌రెడ్డి అధిష్టానానికి సంకేతం ఇస్తూ వస్తున్నారు. గతంలో కూడా పార్టీ నిర్ణయాలపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించారు.
మున్సిపల్ ఎన్నికలతో ముదిరింది..
ఏడాదికాలంగా జీవన్‌రెడ్డికి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గానికి మధ్య అంతర్గత కుమ్ములాట జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సమయంలో పార్టీ గుర్త ఎన్నికలు కాకపోవడంతోపెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, మున్సిపల్ ఎన్నికల వచ్చే సరికి ఇరు వర్గాల మధ్య కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సమస్యలు తలెత్తాయి. సంజయ్‌వర్గం అభ్యర్థులకు పార్టీ బీఫాంలు అదించింది. దీంతో జీవన్‌రెడ్డి కతల చెందారు. దీంతో తన వర్గం అభ్యర్థులను స్వతంత్రులుగా బరిలో దించారు. ఫలితాల్లో జీవన్‌రెడ్డి వర్గం 14 మంది గెలవగా, సంజయ్ వర్గం నుంచి 20 మంది గెలిచారు. దీంతో రెండు వర్గాలు కలిస్తే కానీ, పీఠం దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో జీవన్‌రెడ్డి పీఠం తమ వర్గానికే ఇవ్వలని పట్టుబట్టారు. అధిష్టానంతో మాట్లాడారు. కానీ, సంజయ్ వర్గానికే పార్టీ పీఠం కట్టబెట్టింది. దీంతో జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీలో కొనసాగాలనిపించడంలేదని వ్యాఖ్యానించారు.
అధిష్టానం బుజ్జగింపులు..
తాజా వ్యాఖ్యల నేపథ్యం.. మంగళవారం ఢిల్లీకి వెళతానని ప్రకటించడంతో టీపీసీసీ రంగంలోకి దిగింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చింది. అయినా జీవన్‌రెడ్డి మెత్తబడలేదు. మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మొదటి దశలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. జీవన్ రెడ్డికి జిల్లా స్థాయి బాధ్యతలు లేదా ప్రభుత్వంలో పదవి ఇచ్చి మెత్తగా చేయవచ్చు. అయితే, అధిష్ఠానం కఠినత చూపితే, ఆయన తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా బలపడకముందే ఇలాంటి కలహాలు పార్టీకి నష్టం కలిగిస్తాయి.
ఈ డ్రామా పాజిటివ్‌గా ముగిస్తే, కాంగ్రెస్ తన నాయకులను ఏకం చేసుకునే అవకాశం. నెగటివ్‌గా మారితే, పార్టీ ఓటు బ్యాంక్ బలహీనపడుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిణామం కీలకం. జీవన్ రెడ్డి వంటి స్థానిక నాయకులు పార్టీకి అవసరమని అధిష్ఠానం గుర్తుంచుకోవాలి.