Jagadishwar Reddy vs Radha Krishna: కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ భారత రాష్ట్ర సమితి శాసన సభ్యుడు జగదీశ్వర్ రెడ్డిని మరుగుజ్జు నాయకుడు అని సంబోధించారు. రాధాకృష్ణ రాసిన రాతలు జర్నలిజం సర్కిల్స్ లో సంచలనం సృష్టించాయి. దీనిపై జగదీశ్వర్ రెడ్డి ఎలా స్పందిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి ఆ ఎదురుచూపుకు జగదీశ్వర్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. మొత్తంగా తన మనసులో దాగివున్న అనేక విషయాలను ఆయన బయటపెట్టారు.
తెలంగాణ ముమ్మాటికి తమ జాగీర్ అని జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ఉద్యమంలో ఉన్నామని.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని.. అందువల్లే తెలంగాణ తమకు మాత్రమే సొంతమని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు తనపై రాతలు రాసిన వేమూరి రాధాకృష్ణ పై ఆయన మండిపడ్డారు. ఆర్కేను అరెస్ట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ నాటి ముఖ్యమంత్రి వెనక్కి తగ్గారని.. అలాంటి వ్యక్తి మీద ఆర్కే అలాంటి రాతలు రాయడం దారుణమని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పచ్చ బ్యాచ్ ను కటకటాల వెనక్కి పంపించడానికి అనేక అవకాశాలు వచ్చినప్పటికీ తాము ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేదని జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.. ఇకపై చూస్తూ ఊరుకునేది లేదని జగదీశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: జగన్ ఓడిపోతారని నేను ఊహించలేదు.. కేటీఆర్ కామెంట్స్ వైరల్!
ఒక పాత్రికేయుడిగా ఉండాల్సిన వేమూరి రాధాకృష్ణ.. తన పరిధి దాటిపోయారన్నారు. లైన్ అతిక్రమించి వార్తలు రాశారని.. తనమీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పాత్రికేయుడుగా ఉండాల్సిన రాధాకృష్ణ రాజకీయ నాయకుడిగా మారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇది జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధమని జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ రాజకీయ అండ చూసుకొని రెచ్చిపోతున్నారని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని వేమూరి రాధాకృష్ణ గుర్తుపెట్టుకోవాలని జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.. తనను మరుగుజ్జు నాయకుడు అనడం ఆయన అవివేకానికి నిదర్శనం అని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తాను మూడుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచారని.. రెండుసార్లు మంత్రిగా పని చేశానని.. నియోజకవర్గ ప్రజల అండవల్లే తాను ఇక్కడిదాకా వచ్చానని.. అటువంటి నన్ను మరుగుజ్జు నాయకుడు అని ఎలా సంబోధిస్తారని రాధాకృష్ణను ప్రశ్నించారు. జర్నలిజం విలువలతో చేయాలని.. ఇలా రాజకీయ పార్టీల మాదిరిగా లక్ష్యాలతో చేయకూడదని వేమూరి రాధాకృష్ణను జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు..
జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన వీడియోను గులాబీ పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా హాండిల్స్ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు వేమరి రాధాకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలను కట్ చేసి ప్రసారం చేస్తున్నాయి. జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు ఆకర్షణీయమైన థంబ్ నెయిల్స్ పెట్టి ప్రచారం చేస్తున్నాయి గులాబీ సోషల్ మీడియా గ్రూపులు. మరి దీనిపై వేమూరి రాధాకృష్ణ ఏ విధంగా స్పందిస్తారు? కొత్త పలుకులో ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది చూడాల్సి ఉంది.