Kavitha accuses Harish Rao: జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత నిశ్శబ్దంగానే ఉంటారు. తన తండ్రి మాదిరిగానే ఎదుటివారితో మాట్లాడుతుంటారు. ఏ మాత్రం ఆగ్రహాన్ని ప్రదర్శించరు. తనకు కీడు తల పెట్టాలని చూసినప్పటికీ చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. ఇదే విషయాన్ని జాగృతిలో పనిచేసినవారు చెబుతుంటారు. గతంలో కవిత పేరు చెప్పుకొని వసూళ్లు చేసిన వ్యక్తిని కూడా ఆమె క్షమించారు. జస్ట్ ఒక్క మాటతో హెచ్చరించి వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరడంతో.. కవిత అందరికీ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇటువంటి గుణం ఉన్న కవిత ఒక్కసారిగా ఆమె కుటుంబంలోని ఇద్దరు కీలక వ్యక్తుల మీద ఆరోపణలు చేయడం.. అది కూడా తీవ్రమైన స్వరం తో మాట్లాడటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కలిగించింది. అయితే ఇది రాత్రికి రాత్రి కలిగింది కాదు.
ఓటమికి కారణం వారే..
2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో తన ఓటమికి కారణం కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులని మొదటి నుంచి కూడా కవిత ఆరోపిస్తూ వస్తున్నారు. అప్పట్లో తన ఓటమికి కొంతమంది పరోక్షంగా కారణమయ్యారని.. అసలు క్షేత్రస్థాయిలో బలం లేని బీజేపీ నిజామాబాదులో గెలిచింది అంటే దానికి కారణం వారేనని కవిత అప్పట్లో ఆరోపించడం సంచలనం కలిగించింది. ఇదే విషయాన్ని తన తండ్రి వద్ద చెప్పుకొని బాధపడింది. కాకపోతే పార్టీ అంతర్గత వ్యవహారం బయటపడితే ఇబ్బంది ఎదురవుతుందని గులాబీ దళపతి ఈ విషయాన్ని వారిద్దరి మధ్య ఉంచారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీకి ఎదురు అనేది లేకుండా పోయింది. ఇదే ధీమాతో కవిత కూడా గెలుస్తుందని గులాబీ దళపతి భావించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా రావడంతో ఆయన కూడా ఒకరకంగా ఫలితాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు పనిగట్టుకుని కవితను ఓడించారని గులాబీ అధినేత అంతర్గత నివేదికలో తేలినప్పటికీ.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆయన కూడా ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది.
అందువల్లేనా
నాడు తన ఓటమికి కారణం కావడంతో కవిత ఇప్పుడు తన అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నాడు నిజామాబాదులో కవిత పోటీ చేయాల్సింది కాదట. ఆమె సేఫ్ సైడ్ గా కరీంనగర్లో పోటీ చేయాలని అనుకున్నారట. అయితే తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదిక ను కెసిఆర్ ముందుకు వచ్చిన నాటి గులాబీ నాయకులు.. కవితను నిజామాబాద్ పంపించారట. అప్పటికే ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉండడంతో గులాబీ దళపతి కూడా ధీమా వ్యక్తం చేశారట.. కానీ సొంత పార్టీ నాయకులు మోసం చేయడంతో కవిత ఓడిపోయారట. నాడు తన ఓటమికి ఓ ముఖ్య నేత పరోక్షంగా కారణమయ్యారని కవితకు తెలియడంతో… అప్పటినుంచి ఆమె ఆగ్రహం గానే ఉన్నారట. నాటి అగ్రహాన్ని ఇదిగో ఇప్పుడు ఇలా తీర్చుకున్నారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ముక్కు సూటిగా ఉండే కవిత.. మొహమాటం లేకుండానే అసలు విషయాన్ని చెప్పారు. దీనివల్ల తెలంగాణ రాజకీయాలు ఎలాంటి వైపు మరలిపోతాయి.. ఎలాంటి పరిణామాలకు కారణం అవుతాయి.. అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.